జీడీపీ గణాంకాలు కీలకం | GDP figures are crucial | Sakshi
Sakshi News home page

జీడీపీ గణాంకాలు కీలకం

Published Mon, Feb 26 2018 2:09 AM | Last Updated on Mon, Feb 26 2018 2:09 AM

GDP figures are crucial - Sakshi

జీడీపీ, తయారీ రంగ గణాంకాలు, డాలర్‌తో రూపాయి కదలికలు ఈ వారం మార్కెట్‌కు కీలకం కానున్నాయని నిపుణులంటున్నారు. ఉత్తర కొరియాపై అమెరికా భారీగా ఆంక్షలు విధించడం కూడా ప్రభావం చూపించవచ్చని నిపుణులంటున్నారు. వీటితో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల గమనం, ప్రపంచ మార్కెట్ల పోకడ, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి తదితర అంశాలు స్టాక్‌ సూచీల కదలికలను నిర్దేశిస్తాయని మార్కెట్‌ విశ్లేషకులంటున్నారు.  హోలీ కారణంగా వచ్చే నెల 2(శుక్రవారం) మార్కెట్‌కు సెలవు. ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితం కానున్నది.  

బుధవారం క్యూ3 జీడీపీ గణాంకాలు..
ఈ నెల 28న(బుధవారం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక జీడీపీ గణాంకాలు వస్తాయి. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో 5.7 శాతంగా ఉన్న జీడీపీ ఈ క్యూ2లో 6.3 శాతానికి పెరిగింది. అదే రోజు తయారీ రంగ పీఎమ్‌ఐ గణాంకాలు కూడా వెలువడతాయి. గత ఏడాది డిసెంబర్‌లో 54.7గా ఉన్న తయారీ రంగ పీఎమ్‌ఐ గత నెలలో 52.4కు పడిపోయింది.

ఫిబ్రవరి నెల వాహన విక్రయ వివరాలను వాహన కంపెనీలు వచ్చే నెల 1(గురువారం) వెల్లడిస్తాయి. దీంతో ఈ వారం వాహన షేర్లు వెలుగులోకి రావచ్చు. ఇక ఈ వారంలో 17 కంపెనీలు తమ క్యూ3 ఫలితాలను వెల్లడిస్తాయి. ఓఎన్‌జీసీ, సీఈఎస్‌సీ, పీఎఫ్‌సీ, టీవీఎస్‌ మోటార్‌  తదితర కంపెనీలు తమ క్యూ3 ఫలితాలను ఈ వారంలోనే వెల్లడిస్తాయి.  

మార్కెట్‌ ముందుకే !
ఇన్వెస్టర్లు తాజా సంకేతాల కోసం ఎదురుచూస్తున్నారని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. ప్రపంచ మార్కెట్లు నిలకడగా ఉంటే, అది దేశీయంగా ఇన్వెస్టర్లపై సానుకూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఇక ఈ వారంలో క్యూ3 జీడీపీ అంచనాలు, తయారీ రంగ గణాంకాలు కీలకం కానున్నాయని వ్యాఖ్యానించారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం మార్కెట్‌పై బాగానే ప్రభావం చూపించిందని శామ్‌కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోదీ చెప్పారు.

అయితే ఇది ఇప్పటికే మార్కెట్లో పూర్తిగా డిస్కౌంట్‌ అయిపోయిందని పేర్కొన్నారు. ఈ కుంభకోణం సైజు చిన్నదేనని, దేశ వృద్ధి జోరును ఆపే శక్తి ఈ స్కామ్‌కు లేదని వివరించారు. ఈ కుంభకోణాన్ని విస్మరించి మార్కెట్‌ ముందుకే దూసుకుపోతుందని పేర్కొన్నారు. గత వారంలో డాలర్‌తో రూపాయి మారకం బాగా క్షీణించిందని, ఇది ఆందోళన చెందే విషయమని ఏంజెల్‌బ్రోకింగ్‌  చీఫ్‌ అనలిస్ట్‌ సమీత్‌ చవాన్‌ చెప్పారు. రూపాయిపై,  అమెరికా మార్కెట్‌పై ఇన్వెస్టర్లు ఒక కన్నేసి ఉంచాలని ఆయన సూచించారు.  

నేటి నుంచి హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఐపీఓ  
హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌ ఐపీఓ సోమవారం ప్రారంభమై ఈ నెల 28(బుధవారం) ముగుస్తుంది. రూ.263–270 ప్రైస్‌బాండ్‌తో ఈ ఐపీఓ ద్వారా రూ.462 కోట్లు సమీకరించాలని  కంపెనీ యోచిస్తోంది. కనీసం 55 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వచ్చే నెల 9న ఈ షేర్‌ స్టాక్‌ మార్కెట్లో లిస్టవుతుంది. ఇక ఆస్టర్‌ డీఎమ్‌ హెల్త్‌కేర్‌ కంపెనీ షేర్‌ నేడు(సోమవారం) స్టాక్‌మార్కెట్లో లిస్ట్‌కానున్నది. రూ.180–190 ప్రైస్‌బాండ్‌తో వచ్చిన ఈ ఐపీఓ 1.3 రెట్లు సబ్‌స్క్రైబయింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.980 కోట్లు సమీకరించింది.  


10,000 కోట్ల విదేశీ నిధులు వెనక్కి
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటిదాకా మన స్టాక్‌ మార్కెట్‌నుంచి రూ.10,000 కోట్ల మేర పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) రూ.11,400 కోట్ల కుంభకోణానికి అంతంత మాత్రంగానే ఉన్న అంతర్జాతీయ సంకేతాలు కూడా తోడవడంతో ఈ స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్‌ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నారని నిపుణులంటున్నారు.

కాగా గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్‌ మార్కెట్లో రూ.13,780 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. దేశీయ సంకేతాలు బలహీనంగా ఉండటం, ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో ద్రవ్యలోటు పెరుగుతుందేమోనన్న ఆందోళన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు.డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెల 1–23 మధ్యన స్టాక్‌ మార్కెట్లో రూ.9,899 కోట్ల మేర పెట్టుబడులు ఉపసంహరించుకోగా, డెట్‌ మార్కెట్లో మాత్రం రూ.1,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement