
భారత్ వృద్ధి 7.7 శాతం
2016-17పై ఫిక్కీ సర్వే అంచనా
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) 7.7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పారిశ్రామిక మండలి ఫిక్కీ నిర్వహించిన ఒక సర్వే తెలిపింది. తగిన వర్షపాతం అంచనాలు నిజమైతే అటు వ్యవసాయ రంగం, ఇటు పారిశ్రామిక రంగం రెండూ మెరుగుపడతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పెట్టుబడుల క్రమం కూడా పుంజుకునే వీలుందని వివరించింది. సర్వే ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యవసాయ రంగం వృద్ధి రేటు 2.8 శాతం నమోదయ్యే వీలుంది. 1.6 శాతం- 3.5 శాతం కనిష్ట, గరిష్ట శ్రేణులను సైతం సర్వే పేర్కొనడం గమనార్హం. ఇక పారిశ్రామిక వృద్ధి 7.1 శాతంగా అంచనా వేసిన సర్వే, జీడీపీలో మెజారిటీ వాటా ఉన్న సేవల రంగం వృద్ధి రేటును 9.6 శాతంగా అంచనావేసింది.