మాయలో పడొద్దు
ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని పేరుతో..
తెలంగాణలో అభివృద్ధి జోరంటూ స్థిరాస్తి వ్యాపారం
గుడ్డిగా ముందుకెళ్తే బోల్తాపడ్డట్లే
కొనుగోలుకు ముందే జాగ్రత్తలు అవసరం
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో స్థిరాస్తి వ్యాపారం ‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అన్న చందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని వ్యవహారంతో, తెలంగాణలో విదేశీ సంస్థలొస్తున్నాయి, అభివృద్ధికి డోకాలేదంటూ అనధికారిక ప్రకటనలతో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎకరం ధర రూ.వేలు, లక్షలు దాటి కోట్లకు చేరుకుంది. ధరల సంగతి ఎలాగున్నా భూమి స్థితిగతులను సరిగా అంచనా వేయలేక, వాస్తవాలు తెలియక, దళారుల మాటలను నమ్మి మోసపోయే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనీస ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే భూమిని, అపార్టుమెంట్లను కొనుగోలు చేసే వారు ఆనక ఇబ్బందులు పడరు. మోసపోయాక చేసేదేమీ ఉండదు.
ఫ్లాట్ కొనేముందు..
లక్షలు వెచ్చించి ఫ్లాట్ కొన్నాక హక్కుల్లో చిక్కులు వస్తే ఎంత ఇబ్బంది? ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నిర్మాణ పరమైన అనుమతులు, స్థిరాస్తి యాజమాన్య హక్కు పత్రాలు పక్కాగా ఉన్నాయా? న్యాయపరంగా చెల్లుబాటు అవుతాయా? అన్న విషయాలను చూసుకోవాలి. ఇటీవలికాలంలో కొంత మంది బిల్డర్లు ఓపెన్ స్పేస్‌లో నిర్మాణాలు చేపడుతున్నారు. వాస్తవానికి ఓపెన్ స్పేస్‌లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు. వాటికి అనుమతులు కూడా ఉండవు. కానీ కొంత మంది బిల్డర్లు అక్కడ కూడా నిర్మాణాలు చేసి తక్కువ ధరకే అంటకట్టడానికి ప్రయత్నిస్తుంటారు. వీలైతే అనుభవమున్న న్యాయవాదిని సంప్రదించాలి.
ప్లాన్‌ను పరిశీలించారా?
కొనుగోలుదారులకు బిల్డర్లు అనేక రకాల వరాలు ఇస్తుంటారు. కలలో ఉన్న సౌధాన్ని మాటలతో కళ్ల ముందు చూపిస్తుంటారు. అపార్టుమెంట్లో పిల్లల పార్కు, ఈత కొలను, వ్యాయామశాల వంటి మరెన్నో సౌకర్యాలను చెబుతుంటారు. ఇవన్నీ అపార్టుమెంట్ ప్లాన్‌లో పొందుపరచబడి ఉంటాయి. అందువల్ల ప్లాన్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి. ఇంటీరియర్స్‌కు సంబంధించిన పనులు సాధారణంగా బిల్డర్ చేసివ్వరు. సర్వాంగసుందరంగా ఉండే నమూనా ఫ్లాట్ అన్నది నిర్మాణపరంగా మీ ఫ్లాట్ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే కానీ మీ ఇల్లు ఆ విధంగా చేసిస్తారని పొరపాటుపడొద్దు. ఈతీరుగా మీ ఫ్లాట్ కావాలంటే అదనపు రుసుం కట్టక తప్పదు.
నాణ్యతను గమనించారా?
నిర్మాణ పనులు చివరి దశలోకి రాగానే ఎప్పుడెప్పుడు గృహప్రవేశం చేయాలా అనే తహతహ చాలా మందికి ఉంటుంది. సరిగ్గా ఇక్కడే ఫ్లాట్ నాణ్యతను పరిశీలించాలి. కొందరు బిల్డర్లు నమూనా ఫ్లాట్‌పై చూపెట్టిన శ్రద్ధ వాస్తవ ఫ్లాట్‌లో పాటించరు. ఇటువంటి సమయంలో తెలివిగా వ్యవహరించాలి. ఫ్లాట్ల నిర్మాణంలో నాణ్యత లేకపోతే రాజీపడకూడదు. ఒప్పందాన్ని మీరి నాణ్యత లోపాలు ఉంటే సవరించాకే ఫ్లాట్‌ను స్వాధీనం చేసుకోవాలి. అప్పుడే ఏళ్ల నాటి కష్టం ఇంటిని చూస్తే మాయమవుతుంది.
ప్లాట్ కొనేముందు..
1. భూమి యాజమాన్య హక్కులు చూడాలి. అది పట్టా భూమా? ప్రైవేటుదా? ప్రభుత్వానిదా? తెలుసుకోవాలి. చెప్పిన సర్వే నంబరు క్షేత్రస్థాయిలో ఉందా? లేదా నిర్ధారించుకోవాలి.
2. పలు సందర్భాల్లో ఇరుగుపొరుగు సర్వే నంబర్లు రికార్డుల్లో చేర్పి ఫలానా సర్వే నంబరు అదేనంటూ బుకాయించే అవకాశాలు లేకపోలేదు. పేపర్లలోని సర్వే నంబర్లను నమ్మడం కంటే సంబంధిత సర్వే నంబరు ప్రభుత్వ సర్వేయరు ద్వారా నిర్ధారించుకోవటం మేలు. దీనికి ధ్రువీకరణ పత్రం కూడా ఇస్తారు.
3. {పభుత్వానిదంటే.. అసైన్డ్, వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, స్మశానాలు, ఇనాం, బంజరు, పోరంబోకు, అటవీ, దేవాదాయ, వక్ఫ్, క్రిస్టియన్ మైనార్టీ, నీటిపారుదల శాఖ ఇలా ఏ కేటగిరీకి చెందిన భూమో తెలుసుకోవాలి.
4. ఆక్రమించిన భూములా? లేదా నిర్ధారించుకోవాలి. నిషేధిత భూముల జాబితా (ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్- బదిలీ నిషేధిత భూమి)లో ఉందేమో పరిశీలించుకోవాలి. ఈ వివరాలు రె వెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖల వద్ద ఉంటాయి. ఆర్ఎస్ఆర్ (రీ సర్వే రిజిస్టర్)లో ఏ కేటగిరీ భూమో తెలుస్తుంది.
5. {పతి భూమికి సంబంధించి ఈసీ (ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్), లింక్ డాక్యుమెంట్ తీసుకుని సరిచూసుకోవాలి. ఆయా భూముల ఇరుగుపొరుగు వారిని సంప్రదిస్తే వాస్తవ విషయాలు తెలుస్తాయి.
తనఖా (మార్టగేజ్) పెట్టిన భూమిని, సామాజిక అవసరాల (పార్కులు, ఆటస్థలాలు, రోడ్లు, పారిశ్రామిక అవసరాలు)కు కేటాయించిన భూమిని విక్రయించే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.