హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాంట్రాక్ట్ రీసెర్చ్ సేవల్లో ఉన్న హైదరాబాదీ కంపెనీ జీవీకే బయోసైన్సెస్‌కు పెద్ద దెబ్బే తగిలింది. కంపెనీకి అతిపెద్ద క్లయింట్ అయిన యూకే ఫార్మా దిగ్గజం గ్లాక్సో స్మిత్‌క్లైన్ (జీఎస్‌కే) తీవ్రమైన షాక్ ఇచ్చి ఓ భారీ కాంట్రాక్టు నుంచి మధ్యలోనే వైదొలిగిందని విశ్వసనీయంగా తెలిసింది. దీంతో జీవీకే బయో రూ.200 కోట్లకుపైగా ఆదాయం కోల్పోయినట్లు సమాచారం. సంస్థ ఆదాయంలో ఇది 25%కి పైగా ఉండడంతో సంస్థకు ఎటూ పాలుపోవటం లేదు. జీఎస్‌కేలో కీలక బాధ్యతల్లో ఇటీవల చేరిన ఉన్నతాధికారి ఒకరు ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలతో ఉన్న కాంట్రాక్టులను సమీక్షిస్తున్నారు. ఇందులో భాగమే తాజా పరిణామమని తెలిసింది. జీవీకే బయోపై పలు నియంత్రణ సంస్థలు అలర్ట్ విధించడం తెలిసిందే. జీవీకే బయోతో తమకు బలమైన బంధం ఉందని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీఎస్‌కే ఆర్‌అండ్‌డీ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ వాలెన్స్ చెప్పడం గమనార్హం. అయితే తాజా సమీక్ష పూర్తయిన తర్వాత జీవీకే బయోకు తిరిగి కాంట్రాక్టు దక్కే అవకాశాలు లేవనే చెబుతున్నారు.
ఆందోళనలో ఉద్యోగులు..
గతేడాది జీవీకే వార్షిక ఆదాయం రూ.750 కోట్లు. ఇందులో జీఎస్‌కే కాంట్రాక్టు విలువ రూ.400 కోట్లకు పైమాటే. ఇందులో 6 నెలల కాంట్రాక్టు పూర్తయింది. తాజా పరిణామంతో జీవీకే రూ.200 కోట్ల దాకా కోల్పోతోందని తెలిసింది. జీవీకే బయోలో 2,300 మంది దాకా ఉద్యోగులున్నారు. డ్రగ్ డిస్కవరీలో 1,400 మంది నిమగ్నం కాగా... ఒక్క జీఎస్‌కే సైంటిఫిక్ బిజినెస్ ప్రాజెక్టుపైనే 300 దాకా పనిచేస్తున్నట్టు తెలిసింది. వీరిలో 50 మందిని వివిధ విభాగాల్లో సర్దుతున్నారని, మరో 250 మందికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలన్న డైలమాలో కంపెనీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. జీతాల భారం పెరుగుతుండడంతో వీరిపై వేటు వేయాలా? అన్న భావనలో కంపెనీ ఉన్నట్టు చెబుతున్నారు. ఇదే జరిగితే ఫార్మాకు పెద్ద కుదుపే. కొత్త కాంట్రాక్టు వస్తే ఉద్యోగుల భవితవ్యానికి ఢోకా ఉండకపోవచ్చు.
జీవీకే ఔషధ పరీక్షల్లో లోపాలున్నాయంటూ యూరప్ ఔషధ నియంత్రణ సంస్థ 2014లో సంచలన ప్రకటన చేయటం తెలిసిందే. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆఫ్ మెడిసిన్స్, హెల్త్ ప్రొడక్ట్స్(ఏఎన్‌ఎస్‌ఎం) నివేదికలో ఇది తేలడంతో జీవీకే అధ్యయనం చేసిన వందలాది జనరిక్ ఔషధాలకు విక్రయ అనుమతులను ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, లక్సెంబర్గ్ ఔషధ నియంత్రణ సంస్థలు రద్దు చేశాయి కూడా.
జీవీకే బయోకు షాక్!
Published Thu, Oct 12 2017 12:45 AM | Last Updated on Fri, May 25 2018 2:57 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment