gvk bio sciences
-
GVK Biosciences: రూ. 7,300 కోట్ల డీల్!
ముంబై: కాంట్రాక్ట్ రీసర్చ్, డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అయిన జీవీకే బయోసైన్సెస్‌లో గోల్డ్‌మన్ శాక్స్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ 33 శాతం వాటా చేజిక్కించుకుంటోంది. క్రిస్‌క్యాపిటల్ తనకున్న 17 శాతం వాటా, ప్రమోటర్లు 16 శాతం వాటాను విక్రయిస్తున్నట్టు సమాచారం. ఈ డీల్ ద్వారా జీవీకే బయోను రూ.7,300 కోట్లుగా విలువ కట్టారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ జెఫరీస్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తోంది. ఇక కొద్ది రోజుల్లో ఈ డీల్ విషయమై అధికారిక ప్రకటన వెలువడనుంది. డీల్ పూర్తి అయితే గోల్డ్‌మన్ శాక్స్‌కు భారత ఫార్మా రంగంలో గడిచిన ఆరు నెలల్లో ఇది రెండవ పెట్టుబడి అవుతుంది. గోల్డ్‌మన్ శాక్స్ 2020 నవంబరులో బయోకాన్‌కు చెందిన బయోకాన్ బయాలాజిక్స్లో సుమారు రూ.1,100 కోట్లు పెట్టుబడి చేసింది. జీవీకే బయోసైన్సెస్‌లో జీవీకే కుటుంబానికి, డీఎస్ బ్రార్ కుటుంబానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా చెరి 41 శాతం వాటా ఉంది. ఇదీ జీవీకే బయో నేపథ్యం.. జీవీకే బయోను జీవీకే గ్రూప్, ర్యాన్‌బాక్సీ ల్యాబొరేటరీస్ మాజీ సీఈవో అయిన డీఎస్ బ్రార్ ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోటర్, చైర్మన్‌గా 2004లో జీవీకే బయో బోర్డులో బ్రార్ చేరారు. 2001లో ప్రారంభమైన ఈ సంస్థలో 2,500 పైచిలుకు శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఔషధ ఆవిష్కరణ, రసాయన, జీవ శాస్త్రం, మాలిక్యూల్ పరిశోధన, అభివృద్ధి, రసాయనాల అభివృద్ధి, ఫార్ములేషన్, ఒప్పంద తయారీ విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. 450కిపైగా క్లయింట్లు ఉన్నారు. 2019–20లో రూ.950 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఎబిటా రూ.275 కోట్లుగా ఉంది. ఔషధ ఆవిష్కరణ, పరిశోధనపైనే సగం ఆదాయం సమకూరుతోంది. మిగిలినది కాంట్రాక్ట్ తయారీ విభాగం నుంచి వస్తోంది. 2014లో యూఎస్‌కు చెందిన ప్రీ–క్లినికల్ కాంట్రాక్ట్ రీసర్చ్ రంగంలో ఉన్న ఆరాజెన్ బయోసైన్సెస్‌ను కొనుగోలు చేసింది. చదవండి: Vodafone Idea: ఆ కస్టమర్లకు రూ.49 ప్యాక్ ఉచితం -
జీవీకే బయోకు షాక్!
-
జీవీకే బయోకు షాక్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాంట్రాక్ట్ రీసెర్చ్ సేవల్లో ఉన్న హైదరాబాదీ కంపెనీ జీవీకే బయోసైన్సెస్‌కు పెద్ద దెబ్బే తగిలింది. కంపెనీకి అతిపెద్ద క్లయింట్ అయిన యూకే ఫార్మా దిగ్గజం గ్లాక్సో స్మిత్‌క్లైన్ (జీఎస్కే) తీవ్రమైన షాక్ ఇచ్చి ఓ భారీ కాంట్రాక్టు నుంచి మధ్యలోనే వైదొలిగిందని విశ్వసనీయంగా తెలిసింది. దీంతో జీవీకే బయో రూ.200 కోట్లకుపైగా ఆదాయం కోల్పోయినట్లు సమాచారం. సంస్థ ఆదాయంలో ఇది 25%కి పైగా ఉండడంతో సంస్థకు ఎటూ పాలుపోవటం లేదు. జీఎస్కేలో కీలక బాధ్యతల్లో ఇటీవల చేరిన ఉన్నతాధికారి ఒకరు ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలతో ఉన్న కాంట్రాక్టులను సమీక్షిస్తున్నారు. ఇందులో భాగమే తాజా పరిణామమని తెలిసింది. జీవీకే బయోపై పలు నియంత్రణ సంస్థలు అలర్ట్ విధించడం తెలిసిందే. జీవీకే బయోతో తమకు బలమైన బంధం ఉందని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీఎస్కే ఆర్అండ్డీ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ వాలెన్స్ చెప్పడం గమనార్హం. అయితే తాజా సమీక్ష పూర్తయిన తర్వాత జీవీకే బయోకు తిరిగి కాంట్రాక్టు దక్కే అవకాశాలు లేవనే చెబుతున్నారు. ఆందోళనలో ఉద్యోగులు.. గతేడాది జీవీకే వార్షిక ఆదాయం రూ.750 కోట్లు. ఇందులో జీఎస్కే కాంట్రాక్టు విలువ రూ.400 కోట్లకు పైమాటే. ఇందులో 6 నెలల కాంట్రాక్టు పూర్తయింది. తాజా పరిణామంతో జీవీకే రూ.200 కోట్ల దాకా కోల్పోతోందని తెలిసింది. జీవీకే బయోలో 2,300 మంది దాకా ఉద్యోగులున్నారు. డ్రగ్ డిస్కవరీలో 1,400 మంది నిమగ్నం కాగా... ఒక్క జీఎస్కే సైంటిఫిక్ బిజినెస్ ప్రాజెక్టుపైనే 300 దాకా పనిచేస్తున్నట్టు తెలిసింది. వీరిలో 50 మందిని వివిధ విభాగాల్లో సర్దుతున్నారని, మరో 250 మందికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలన్న డైలమాలో కంపెనీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. జీతాల భారం పెరుగుతుండడంతో వీరిపై వేటు వేయాలా? అన్న భావనలో కంపెనీ ఉన్నట్టు చెబుతున్నారు. ఇదే జరిగితే ఫార్మాకు పెద్ద కుదుపే. కొత్త కాంట్రాక్టు వస్తే ఉద్యోగుల భవితవ్యానికి ఢోకా ఉండకపోవచ్చు. జీవీకే ఔషధ పరీక్షల్లో లోపాలున్నాయంటూ యూరప్ ఔషధ నియంత్రణ సంస్థ 2014లో సంచలన ప్రకటన చేయటం తెలిసిందే. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆఫ్ మెడిసిన్స్, హెల్త్ ప్రొడక్ట్స్(ఏఎన్ఎస్ఎం) నివేదికలో ఇది తేలడంతో జీవీకే అధ్యయనం చేసిన వందలాది జనరిక్ ఔషధాలకు విక్రయ అనుమతులను ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, లక్సెంబర్గ్ ఔషధ నియంత్రణ సంస్థలు రద్దు చేశాయి కూడా. -
ఈయూతో భారత్ వాణిజ్య చర్చలు వాయిదా
జీవీకే బయోసెన్సైస్ ‘ఔషధాల’ నిషేధానికి ప్రతిచర్య న్యూఢిల్లీ : యూరోపియన్ యూనియన్‌తో (ఈయూ) విస్తృత స్థాయి పెట్టుబడులు, వాణిజ్య ఒప్పందంపై (బీటీఐఏ) యూరోపియన్ యూనియన్‌తో జరగాల్సిన చర్చలను కేంద్రం వాయిదా వేసింది. జీవీకే బయోసెన్సైస్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన 700 ఫార్మా ఉత్పత్తులపై ఈయూ నిషేధం విధించడమే ఇందుకు కారణం. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్.. ప్రతిచర్యగా బీటీఐఏ చర్చలను వాయిదా వేసినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అనేక సంవత్సరాలుగా ఈ ఔషధాలు ఎలాంటి ప్రతికూల ప్రభావాలు లేకుండా అనేక సంవత్సరాలుగా ఈయూలో చెలామణీలో ఉన్నప్పటికీ వీటిని నిషేధించడం సరికాదని పేర్కొంది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఆగస్టు 28న భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉంది. భారత్-ఈయూల మధ్య వాణిజ్యం 2014-15లో దాదాపు 99 బిలియన్ డాలర్లుగా ఉంది. -
700 ‘జీవీకే’ ఔషధాలపై ఈయూ నిషేధం
బెర్లిన్ : ఫార్మా రీసెర్చ్ సంస్థ జీవీకే బయోసెన్సైస్ నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై 700 జనరిక్ ఔషధాల విక్రయాలను యూరోపియన్ యూనియన్ (ఈయూ) నిషేధించింది. ఆగస్టు 21 నుంచి ఇది అమల్లోకి వస్తుందని జర్మనీ ఔషధ నియంత్రణ సంస్థ ఫెడరల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడిసిన్స్ అండ్ మెడికల్ ప్రోడక్ట్స్ తెలిపింది. నిర్దేశిత తేదీ తర్వాత వీటిని ఫార్మా కంపెనీలు, డీలర్లు, మెడికల్ హాల్స్, అవుట్‌లెట్స్‌లో విక్రయించకూడదని పేర్కొంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే జీవీకే బయోసెన్సైస్ 2004-2014 మధ్య నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో అవకతవకలు జరిగాయని ఫ్రెంచ్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఏఎన్ఎస్ఎం) తనిఖీల్లో తేల్చింది. దీంతో ఆ ట్రయల్స్ ఆధారంగా మార్కెటింగ్ అనుమతులు లభించిన 1,000 జనరిక్ ఔషధాలను ఈయూ కమిటీ పరిశీలించిన మీదట నిషేధం నిర్ణయం తీసుకుంది. ఈ ఆరోపణలను జీవీకే బయోసెన్సైస్ ఖండించింది. -
పరిశోధనలకు నిధుల కొరత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిస్కు కొంత అధికంగా ఉండే జీవ శాస్త్ర పరిశోధనలకు నిధుల లభ్యత ప్రధాన సమస్యగా ఉంటోందని జీవీకే బయోసెన్సైస్ సీఈవో మణి కంటిపూడి తెలిపారు. ఇందులో పెట్టుబడులు పెరిగితే మరిన్ని నూతన ఆవిష్కరణలు సాధ్యపడతాయని ఆయన వివరించారు. జీవ శాస్త్ర రంగంలో నవకల్పనలపై కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ, బయో ఏషియా సంయుక్తంగా రూపొందించిన అధ్యయన నివేదికను మణి కంటిపూడి మంగళవారం ఇక్కడ ఆవిష్కరించారు. ఆర్అండ్డీ కార్యకలాపాల్లో ఇన్వెస్ట్ చేయడానికి సంబంధించి పన్నుపరమైన ప్రోత్సాహకాలు ఇస్తే సంపన్న ఇన్వెస్టర్లు వీటి వైపు మళ్లే అవకాశం ఉందని ఈ సందర్భంగా కేపీఎంజీ అడ్వైజరీ హెడ్ ఉత్కర్ష్ పళనిట్కర్ చెప్పారు. ప్రస్తుతం బయో-సిమిలర్స్ మార్కెట్లో భారత్ వాటా అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ దేశీ ఫార్మా సంస్థల పరిశోధనల నేపథ్యంలో రాబోయే ఐదేళ్లలో 20-25 శాతం వాటా దక్కించుకోగలదని నివేదిక పేర్కొంది. భారత ఫార్మా కంపెనీలు ఆంకాలజీ, డెర్మటాలజీ వంటి విభాగాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయని వివరించింది.