పరిశోధనలకు నిధుల కొరత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిస్కు కొంత అధికంగా ఉండే జీవ శాస్త్ర పరిశోధనలకు నిధుల లభ్యత ప్రధాన సమస్యగా ఉంటోందని జీవీకే బయోసెన్సైస్ సీఈవో మణి కంటిపూడి తెలిపారు. ఇందులో పెట్టుబడులు పెరిగితే మరిన్ని నూతన ఆవిష్కరణలు సాధ్యపడతాయని ఆయన వివరించారు. జీవ శాస్త్ర రంగంలో నవకల్పనలపై కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ, బయో ఏషియా సంయుక్తంగా రూపొందించిన అధ్యయన నివేదికను మణి కంటిపూడి మంగళవారం ఇక్కడ ఆవిష్కరించారు.
ఆర్‌అండ్‌డీ కార్యకలాపాల్లో ఇన్వెస్ట్ చేయడానికి సంబంధించి పన్నుపరమైన ప్రోత్సాహకాలు ఇస్తే సంపన్న ఇన్వెస్టర్లు వీటి వైపు మళ్లే అవకాశం ఉందని ఈ సందర్భంగా కేపీఎంజీ అడ్వైజరీ హెడ్ ఉత్కర్ష్ పళనిట్కర్ చెప్పారు. ప్రస్తుతం బయో-సిమిలర్స్ మార్కెట్లో భారత్ వాటా అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ దేశీ ఫార్మా సంస్థల పరిశోధనల నేపథ్యంలో రాబోయే ఐదేళ్లలో 20-25 శాతం వాటా దక్కించుకోగలదని నివేదిక పేర్కొంది. భారత ఫార్మా కంపెనీలు ఆంకాలజీ, డెర్మటాలజీ వంటి విభాగాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయని వివరించింది.