
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ ఔషధ రంగ దిగ్గజం గ్లెన్‌మార్క్ తాజాగా మధుమేహ వ్యాధి చికిత్సకి సంబంధించి మరో ఔషధాన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రెమో, రెమోజెన్ బ్రాండ్స్ (రెమోగ్లిఫ్లోజిన్) పేరిట వీటిని విక్రయించనున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ (ఇండియా ఫార్ములేషన్స్ విభాగం) సుజేష్ వాసుదేవన్ తెలిపారు. టైప్ 2 డయాబెటిస్ చికిత్సలో ఇది ఉపయోగపడుతుందని గురువారమిక్కడ ఔషధ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులకు తెలిపారు. మరింత ప్రభావవంతంగా పనిచేసే ఎస్‌జీఎల్‌టీ2 కోవకి చెందిన ఇతర ఔషధాలతో పోలిస్తే రెమోను 50 శాతం తక్కువ రేటుకే అందిస్తున్నట్లు ఆయన వివరించారు. రోజుకు రెండు సార్లు వేసుకోవాల్సిన ఈ ట్యాబ్లెట్ ధర రూ. 12.50గా ఉంటుంది.
జపాన్ సంస్థ కిసై ఫార్మా దీన్ని రూపొందించగా, గ్లాక్సోస్మిత్‌క్లైన్.. బీహెచ్‌వీ ఫార్మా అభివృద్ధి చేసినట్లు సుజేష్ చెప్పారు. దేశీయంగా ఎస్‌జీఎల్‌టీ2 ఔషధ మార్కెట్ దాదాపు రూ.574 కోట్ల స్థాయిలో ఉన్నట్లు ఆయన తెలిపారు. దీన్ని మొట్టమొదటిగా భారత్‌లోనే ప్రవేశపెట్టామని, పూర్తి దేశీయంగా ఈ ఔషధాన్ని తయారు చేస్తున్నామని ఆయన వివరించారు. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా గతంలో లాగే భారత విభాగం ఆదాయాలు సుమారు 12–14% మేర పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు సుజేష్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ ఆదాయాలు 10% వృద్ధితో రూ. 2,514 కోట్లుగా నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment