గ్లెన్ మార్క్ ఫార్మా భారీ పతనం
గ్లెన్ మార్క్ ఫార్మా భారీ పతనం
Published Fri, May 12 2017 12:56 PM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM
గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ భారీగా పతనమవుతోంది. మార్చి క్వార్టర్ ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో ఈ కంపెనీ షేరు విలువ మార్నింగ్ ట్రేడింగ్ లో 16 శాతం మేర నష్టపోయి, 760 రూపాయల వద్ద నమోదైంది. గత ఏడేళ్లలో ఇదే అతిపెద్ద ఇంట్రాడే పతనం. కంపెనీ ప్రకటించిన మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్ ఫలితాల్లో రూ.184 కోట్ల నికర లాభాలను నమోదుచేసింది. అయితే ఇవి విశ్లేషకులు అంచనావేసిన దానికంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఈ కంపెనీ రూ.548 కోట్ల మేర నికర లాభాలను ఆర్జిస్తుందని విశ్లేషకులు అంచనావేశారు. వారి అంచనాలన్నీ తలకిందులు చేస్తూ కంపెనీ ఫలితాలను ప్రకటించింది. అంతకముందు 2009 ఫిబ్రవరి 19న కూడా కంపెనీ ఇంట్రాడే ట్రేడ్ లో 17.4 శాతం మేర నష్టపోయింది. ఆ తర్వాత ఇదే అతిపెద్ద పతనం.
క్వార్టర్ రివ్యూలో నిర్వహణల నుంచి కంపెనీకి వచ్చిన రెవెన్యూలు సింగిల్ డిజిట్ మాత్రమే నమోదై, రూ.2,457 కోట్లగా ఉన్నాయి. ఈ రెవెన్యూలు కూడా రూ.2,713 కోట్లగా ఉంటాయని విశ్లేషకులు భావించారు. కంపెనీకి అతిపెద్ద మార్కెట్ గా ఉన్న అమెరికాలో విక్రయాలు 53.5 శాతం పెరిగి రూ.1000 కోట్లగా నమోదుకాగ, భారత్ లో అవి కేవలం 6.9 శాతం మాత్రమే పెరిగి రూ.577 కోట్లగా రికార్డయ్యాయి. మార్చి 31 వరకు గ్లెన్ మార్క్ నికర రుణాలు కూడా రూ.3667 కోట్లకు పెరిగాయి. గత నాలుగు నెలల్లో గ్లెన్ మార్క్ గోవా, బడీ తయారీ సంస్థల్లో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ భారీగా దాడులు జరిపింది.
Advertisement