359 పాయింట్ల లాభంతో 25,842కు సెన్సెక్స్
111 పాయింట్ల లాభంతో 7,843కు నిఫ్టీ
అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉండటంతో భారత్ స్టాక్ మార్కెట్ కూడా గురువారం లాభాల్లో ముగిసింది. వడ్డీరేట్లను క్రమక్రమంగా పెంచాలని అమెరికా ఫెడరల్ రిజర్వ్ యోచిస్తోందని ఫెడ్ మినట్స్ వెల్లడించడం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు లాభాలను తెచ్చిపెట్టింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 359 పాయింట్లు (1.41 శాతం)లాభపడి 25,842 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 111 పాయింట్లు(1.43 శాతం) లాభపడి 7,843 పాయింట్ల వద్ద ముగిశాయి. ఏడువారాల్లో సెన్సెక్స్ ఒక్క రోజులో ఇంత లాభపడడం ఇదే మొదటిసారి. ఫార్మా సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. రియల్టీ, ఐటీ, బ్యాంక్, ఆర్థిక సేవలు, ఆయిల్, ఎఫ్‌ఎంసీసీ, వాహన షేర్లు ర్యాలీ జరిపాయి. దశలవారీగా ఫెడ్ వడ్డీరేట్లను పెంచడం వల్ల విదేశీ నిధులు ఒక్కసారిగా బయటకు తరలివెళ్లబోవనే అంచనాలతో ఆసియా మార్కెట్లు లాభాల బాట పట్టాయి. మరోవైపు రూపాయి బలపడడం, ఎగుమతులకు 3 శాతం వడ్డీ సబ్సిడీ స్కీమ్‌ను కేంద్రం బుధవారం ప్రకటించడం సెంటిమెంట్‌కు ఊపునిచ్చాయి.
స్వల్ప కాలిక ఊరటే..
అయితే ఇది షార్ట్‌కవరింగ్ ర్యాలీ అని, ఇది స్వల్పకాలమే ఉంటుందని కొంతమంది నిపుణులంటున్నారు. నవంబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగిసిన తర్వాత కరెక్షన్ తప్పదని వారంటున్నారు. ఏడవ వేతన సంఘం తన నివేదికను కేంద్రానికి సమర్పిస్తున్న నేపథ్యంలో వాహన, కన్సూమర్ డ్యూరబుల్ షేర్లు జోరందుకున్నాయి. మారుతీ సుజుకీ, బజాజ్ ఆటోలు 3 శాతం వరకూ పెరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ కంపెనీలు 1-3% రేంజ్‌లో పెరిగాయి.
మరిన్ని ముఖ్యాంశాలు...
రైలు రవాణాకు సంబంధించి 3 రాష్ట్రాల్లో పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో రైల్వే స్టాక్ట్స్ లాభపడ్డాయి.
మౌలిక రంగానికి ఉత్తేజాన్నిచ్చే చర్యలు తీసుకోవడంతో కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, గాయత్రి ప్రాజెక్ట్స్ వంటి నిర్మాణ, ఇంజినీరింగ్ షేర్లు 13 శాతం వరకూ పెరిగాయి. అమెరికా చట్టాల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్‌కు నష్టాలు కొనసాగుతున్నాయి. బీఎస్‌ఈలో షేర్ ఇంట్రాడేలో 7 శాతం పతనమై చివరకు 2.6 శాతం నష్టంతో రూ.3,287 వద్ద ముగిసింది.
మార్కెట్ డేటా...
టర్నోవర్ (రూ.కోట్లలో)
బీఎస్‌ఈ 2,554
ఎన్‌ఎస్‌ఈ (ఈక్విటీ విభాగం) 15,316
ఎన్‌ఎస్‌ఈ(డెరివేటివ్స్) 2,82,254
నికర అమ్మకాలు/కొనుగోళ్లు (రూ.కోట్లలో)
ఎఫ్‌ఐఐ -343
డీఐఐ 234
గ్లోబల్ ట్రెండ్-మార్కెట్ ర్యాలీ
Published Fri, Nov 20 2015 12:22 AM | Last Updated on Fri, Aug 24 2018 4:48 PM
Advertisement
Advertisement