అమ్మకానికి జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ వాటా!
30 శాతం వాటా విక్రయం ద్వారా రూ.3,500 కోట్ల సమీకరణ లక్ష ్యం
ఎయిర్‌పోర్టు వ్యాపారం ప్రస్తుత విలువ
రూ. 10,000 కోట్లుగా అంచనా
వాటా విక్రయం ప్రణాళిక ఇంకా
ప్రాథమిక దశలోనే ఉందని కంపెనీ వివరణ...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో :అప్పులను తగ్గించుకోవడానికి ఎయిర్‌పోర్టు వ్యాపారంలో వాటాలను విక్రయించాలని జీఎంఆర్ గ్రూపు నిర్ణయించింది. జీఎంఆర్ ఆనుబంధ కంపెనీగా ఉన్న జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసి స్టాక్ మార్కెట్లో నమోదు చేయడమో, లేక పీఈ ఇన్వెస్టర్లకు వాటాలు విక్రయించటమో చేయటం ద్వారా నిధులు సేకరించే ప్రయత్నంలో కంపెనీ ఉంది. వచ్చే ఏడాది కాలంలో ఎయిర్‌పోర్ట్ వ్యాపారంలో వాటాలను విక్రయించడం ద్వారా కనీసం రూ. 3,500 నుంచి రూ. 4,500 కోట్లు సమీకరించాలన్నది కంపెనీ లక్ష్యంగా ఉంది.
ఈ నిధుల సేకరణకు ముఖ్య సలహాదారుగా క్రెడిట్ సూసీ సంస్థను నియమించినట్లు సమాచారం. ప్రస్తుతం జీఎంఆర్ ఎయిర్‌పోర్టు వ్యాపార విలువను రూ. 10,000 కోట్లుగా మదింపు వేసినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో కనీసం 30 శాతం వాటాను మార్చిలోగా విక్రయించడం ద్వారా కనీసం రూ.3,500 కోట్ల నుంచి రూ. 4,500 కోట్లు సమీకరించాలన్నది కంపెనీ ఆలోచన. ఇప్పటికే జీఎంఆర్ ఎయిర్‌పోర్టులో పెట్టుబడి పెట్టిన వారు వైదొలగడానికి అవకాశం కల్పించడంతోపాటు, అప్పులను తీర్చుకోవడానికి ఈ వాటాల విక్రయాన్ని వాడుకోవాలనేది కంపెనీ ఆలోచనగా ఉంది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో మెక్వైరీ ఎస్‌బీఐ ఇన్‌ఫ్రా, స్టాండర్డ్ చార్టర్డ్ ప్రైవేట్ ఈక్విటీ, జేఎం ఫైనాన్షియల్స్ వంటి పీఈ సంస్థలు సుమారు రూ. 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేయటం తెలిసిందే.
వేగంగా విస్తరిస్తున్న దేశీయ విమానయానరంగంలో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. సింగపూర్‌కు చెందిన చాంగీ ఎయిర్‌పోర్ట్‌తో పాటు ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, కేకేఆర్ వంటి సంస్థలు 30 శాతం వాటాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు మార్కెట్లో వినిపిస్తుండగా... కంపెనీ ప్రతి నిధులు మాత్రం దీన్ని ఖండిం చారు. వాటాల విక్రయం ఇంకా ప్రాథమిక చర్చల దశలోనే ఉందని, హడావిడిగా వాటాలను విక్రయించే ఉద్దేశం లేదని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది.
సగం ఆదాయం ఎయిర్‌పోర్టు నుంచే...
విద్యుత్, రోడ్లు, ఎయిర్‌పోర్ట్ వంటి విభిన్న వ్యాపారాల్లో ఉన్న జీఎంఆర్ గ్రూపునకు ఇప్పుడు ప్రధాన ఆదాయ వనరుగా ఎయిర్‌పోర్టు విభాగం ఎదిగింది. గతేడాది మొత్తం వ్యాపారంలో 49 శాతం ఆదాయం ఎయిర్‌పోర్టుల నుంచే వచ్చింది. 2014-15లో జీఎంఆర్ గ్రూపు ఆదాయం రూ. 11,088 కోట్లుకాగా, ఎయిర్‌పోర్ట్ నుంచి రూ.5,468 కోట్లు సమకూరింది. ప్రస్తుతం జీఎంఆర్ గ్రూపు ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులతో పాటు, ఫిలిఫైన్స్‌లో ఎయిర్‌పోర్టును నిర్వహిస్తోంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 64 శాతం వాటాను, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 63 శాతం, ఫిలిఫైన్స్ మక్టన్ సెబూ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో 40 శాతం వాటా జీఎంఆర్‌కు ఉంది.
పూర్తి అప్పుల ఊబిలో ఉన్న కంపెనీ ఆస్తులను విక్రయించడం ద్వారా రుణ భారాన్ని తగ్గించుకునే పనిలో ఉంది. మార్చిలోగా అప్పులను 30 నుంచి 40 శాతం తగ్గించుకోవాలన్నది కంపెనీ ఆలోచన. సెప్టెంబర్ మాసాంతానికి జీఎంఆర్ గ్రూపు రుణాలు రూ. 40,500 కోట్లు. రెండు రోజుల క్రితమే ఎఫ్‌సీసీబీలు జారీ చేసి రూ. 2,000 కోట్లు సమీకరించింది.