gmr airport
-
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
జర్మనీకి చెందిన స్కైట్రాక్స్ ఏటా ఇచ్చే ‘బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ దక్షిణాసియా 2024’ అవార్డు ఈ ఏడాదికిగాను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను వరించింది. బుధవారం జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన ప్యాసింజర్ టర్మినల్ ఎక్స్పో-2024లో ఈమేరకు ప్రకటన వెలువడినట్లు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(ఆర్జీఐఏ) సీఈవో ప్రదీప్ పణికర్ తెలిపారు. విమానాశ్రయంలో పనిచేసే ఉద్యోగుల పనితీరు, స్నేహ పూర్వకంగా ఉండే విధానం, సమర్థత, సిబ్బంది చురుకుగా వ్యవహరించడం, సమాచార కౌంటర్లు, ఇమ్మిగ్రేషన్, భద్రతా అధికారులు, సెక్యూరిటీ స్టాఫ్, షాప్స్, ఫుడ్ అండ్ బేవరేజస్ అవుట్లెట్లలో స్టాఫ్ పనితీరు మెరుగ్గావుండటం వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుకు ఎంపికచేస్తారు. ఇదీ చదవండి: యువ ఓటర్లకు అదిరిపోయే ఆఫర్.. భారీ రాయితీ ప్రకటించిన సంస్థ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌కు గతేడాది స్కైట్రాక్స్ ఫోర్స్టార్ రేటింగ్‌ను ఇచ్చింది. ఈఏడాది ఏకంగా ప్రముఖ అవార్డుకు ఎంపిక చేయడంపట్ల ఎయిర్పోర్ట్ వర్గాలు హర్షం వ్యక్తంచేశాయి. గత నెలలో హైదరాబాద్ విమానాశ్రయం న్యూదిల్లీలో యాక్రెక్స్(ACREX) హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ స్థాయి అవార్డును గెలుచుకుంది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు జాతీయ పురస్కారం
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జాతీయ పురస్కారం దక్కించుకుంది. ఈ మేరకు ఎయిర్పోర్ట్ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల దిల్లీలో నిర్వహించిన కాలుష్య రహిత వాణిజ్య భవన విభాగ పోటీల్లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు యాక్రెక్స్ హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ పురస్కారం దక్కింది. దీన్ని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీహెచ్ఐఏఎల్) ప్రతినిధులు అందుకున్నారు. ఇదీ చదవండి: మెరైన్ రోబో తయారుచేసిన ఐఐటీ పరిశోధకులు.. ఉపయోగాలివే.. 2030 నాటికి కర్బన ఉద్గారాల రహిత విమానాశ్రయంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జీహెచ్ఐఏఎల్ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటి వరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయిదుసార్లు నేషనల్ ఎనర్జీ లీడర్, తొమ్మిది సార్లు ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియెన్సీ యూనిట్, ఆరు సార్లు ఏసీఐ గ్రీన్ ఎయిర్పోర్ట్ పురస్కారాలు వరించాయని తెలిపారు. -
హైదరాబాద్ ఎయిర్పోర్ట్.. టైమ్ అంటే టైమే..!
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల టైమింగ్ బావుందని నివేదిక వెల్లడైంది. నిర్వహణ, పనితీరు, సమయపాలన (ఆన్‌టైమ్ పర్ఫార్మెన్స్-ఓటీపీ)లో అంతర్జాతీయంగా హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 2023లో ఆన్‌టైమ్ పర్ఫార్మెన్స్ను సమీక్షించిన విమానయాన అనలిటిక్స్ సంస్థ సిరియమ్ రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. టాప్-10 విమానాశ్రయాల్లో మన దేశంలోని కోల్‌కతా విమానాశ్రయం కూడా స్థానం దక్కించుకుంది. టాప్ 1లో అమెరికాకు చెందిన మిన్నేపొలిస్-సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇది ఓటీపీ అధికంగా 84.44% ఉంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 84.42% ఓటీపీతో రెండో స్థానం సాధించింది. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 84.08% ఓటీపీతో మూడో స్థానంలో నిలిచింది. పెద్ద విమానాశ్రయాల్లోనూ ఈ రెండు స్థానం సాధించాయి. మధ్య స్థాయి విమానాశ్రయాల విభాగంలో కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం 83.91 శాతం ఓటీపీతో అంతర్జాతీయంగా తొమ్మితో స్థానం దక్కించుకుంది. ఇదీ చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో మన బ్యాగ్ మనమే చెక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే.. సంస్థల వారీగా.. అంతర్జాతీయంగా దేశంలోని పెద్ద విమానయాన సంస్థ ఇండిగో 82.12% ఓటీపీతో ఎనిమిదో ర్యాంకు సాధించింది. ఆసియా పసిఫిక్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికాకు చెందిన సఫైర్ 92.36% ఓటీపీతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆసియా పసిఫిక్ విభాగంలో జపాన్‌కు చెందిన ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్ 82.75% ఓటీపీతో అగ్ర స్థానం దక్కించుకుంది. జపాన్ ఎయిర్‌లైన్స్ (82.58% ఓటీపీ), థాయ్ ఎయిరేషియా (82.52% ఓటీపీ) రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. విమానం నిర్దేషించిన సమయానికి 15 నిమిషాలు ముందే వస్తే ఆన్‌టైమ్ షెడ్యూల్ అని సిరియమ్ నివేదిక తెలిపింది. -
ఎయిర్‌పోర్ట్‌లో మన బ్యాగ్ మనమే చెక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాదాపు అన్ని సంస్థలు సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనువుగా తమనుతాము నిత్యం అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాయి. నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టడంలో ఎల్లప్పుడూ ముందుండే హైదరాబాద్‌లోని జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ముందడుగు వేసింది. తనిఖీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా సెల్ఫ్ చెక్ కియోస్క్, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులు టర్మినల్లోకి ప్రవేశించడానికి ముందే తనిఖీలు చేయడం, బ్యాగేజీ చెక్ ఇన్, బోర్డింగ్ పాస్‌ల జారీ వరకు అన్ని సదుపాయాలను ఒకేచోట అందిస్తున్నట్టు జీఎమ్మార్ ఎయిర్పోర్ట్ ఈడీ ఎస్జీకే కిశోర్ అన్నారు. విమానాశ్రయంలో ఆధునిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయకుండా సెల్ఫ్ చెక్ కియాస్క్, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. దీంతో టర్మినల్ వద్ద రద్దీ తగ్గడంతోపాటు ప్రయాణికులు మరింత సులభంగా రాకపోకలు సాగించవచ్చని తెలిపారు. ఇదీ చదవండి: వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్ ధర.. ఎంతంటే.. కొత్తగా ఏర్పాటు చేసిన కియాస్క్‌ల వద్ద ప్రయాణికులు వారి బ్యాగ్‌లను వారే చెక్ చేసుకోవచ్చు. అక్కడే బోర్డింగ్ పాస్, బ్యాగ్ ట్యాగ్‌లను తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సేవలు విమానం ప్రారంభమయ్యే గంట ముందు వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. -
Vizag Green Field Airport: వైజాగ్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు రూ.4వేల కోట్లు
వైజాగ్‌లో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం జీఎంఆర్ సంస్థ రూ.4,000 కోట్ల రుణాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ (ఐఐఎఫ్‌సీఎల్) నేతృత్వంలోని కన్సార్టియం ఈ నిర్మాణ సమూహానికి నిధులు సమకూరుస్తుంది. ఐఐఎఫ్‌సీఎల్ 14 ఏళ్లకు 10 శాతం వడ్డీ చొప్పున ఈ రుణాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఎయిర్పోర్ట్ నిర్మాణ సమయంలో, కార్యకలాపాలు మొదలైన ఏడాది వరకు రుణం చెల్లింపుపై మారటోరియం అవసరం అవుతుందని ఐఐఎఫ్‌సీఎల్ తెలిపింది. ఆర్ఈసీ, పీఎఫ్సీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకింగ్ కన్సార్టియంలో భాగమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. భవిష్యత్తులో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధికి నిధులు సమకూర్చడానికి సంస్థ ఆసక్తిగా ఉన్నట్లు ఐఐఎఫ్‌సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పీఆర్ జైశంకర్ తెలిపారు. వైజాగ్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని 2200 ఏకరాల్లో భోగాపురంలో నిర్మిస్తున్నారు. దీన్ని ప్రధానంగా సాయుధ దళాల అవసరాలను తీర్చడానికి ప్రస్తుత విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తున్నారు. -
రోజుకు 90,000 మంది ప్రయాణం!
ముంబై: ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఈ నెల 1–10 తేదీల్లో రోజుకు 90,000 మంది ప్రయాణించారు. జీఎంఆర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మే నెల మధ్య కాలంతో పోలిస్తే ఇది అయిదురెట్లు అధికం. జూన్ చివరినాటికి ప్రయాణికుల సంఖ్య రోజుకు 62,000లకు చేరింది. కోవిడ్ పరిస్థితి మెరుగుపడడం, పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కారణంగా దేశీయ ట్రాఫిక్ 2023 మార్చినాటికి సాధారణ స్థితికి చేరుకుంటుంది. అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో ఇందుకు మరో ఏడాది పడుతుంది. జూలైలో 22.9 లక్షల మంది ఢిల్లీ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించారు. 2019 జూలైలో ఈ సంఖ్య 58 లక్షలు నమోదైంది. ఈ కాలంతో పోలిస్తే విమాన సర్వీసులు గత నెలలో 45% తగ్గి 20,800 ఉంది. సందర్శనీయ స్థలాలు తెరవడంతో టూరిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశీయ సామర్థ్యంలో 72.5 శాతం స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి విమానయాన సంస్థలను కేంద్రం ఆదేశించింది. చదవండి : జియో స్మార్ట్‌ఫోన్ ప్రీ బుకింగ్స్ ఎప్పుడంటే? -
హైదరాబాద్ నుంచి యూకేకు విమాన సర్వీసులు
హైదరాబాద్: ఇతర దేశాలతో విమాన ప్రయాణ సౌకర్యాలు తిరిగి ప్రారంభించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఆగస్టు 17 నుంచి భారత, యూకే ప్రభుత్వాల మధ్య కుదిరిన ‘ఎయిర్ ట్రాన్స్పోర్ట్ బబుల్ ఒప్పందం ప్రకారం జీఎమ్ఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ హీత్రో విమానాశ్రయానికి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో కోలుకుంటున్న పౌర విమాన రంగానికి ఈ చర్య ఎంతో ఊతమిస్తుంది. హైదరాబాద్, లండన్ మధ్య తిరిగి సర్వీసులను ప్రారంభిస్తూ హైదరాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌లోని హీత్రో విమానాశ్రయానికి సోమవారం ఉదయం 7.50 గంటలకు బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన (బీఏ 276) బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానాశ్రయం బయలుదేరింది. టెర్మినల్లోనికి ప్రవేశించడానికి ముందే ప్రయాణికులందరికీ తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్, సామాజిక దూరం నిబంధనలు సహా అన్ని భద్రతాపరమైన చర్యలనూ తీసుకున్నారు. కాగా యూకేకు చెందిన బ్రిటిష్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు నేటి నుంచి ప్రతి వారం నాలుగు సర్వీసులను నిర్వహిస్తుంది. ఇవి ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాలలో ఉంటాయి. భారత ప్రభుత్వ హోమ్ వ్యవహారాల శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ ప్రయాణికుడైనా హైదరాబాద్ నుంచి లండన్‌కు టికెట్టును బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్, లండన్ల మధ్య తిరిగి సర్వీసులు ప్రారంభం కావడం వల్ల ప్రజలను, సరుకులను ఒక చోటి నుంచి మరో చోటికి తరలించడం జరిగి ఆర్థిక, సామాజిక సంబంధాల పునరుద్ధరణకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. కోవిడ్ మహమ్మారి కారణంగా దెబ్బ తిన్న ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడానికి భారత ప్రభుత్వం అన్‌లాక్ 3.0 సందర్భంగా, వివిధ దేశాలతో ‘‘ట్రాన్స్పోర్ట్ బబుల్స్, ‘‘వాయు రవాణా ఒప్పందాలు అనే తాత్కాలిక ఏర్పాట్లకు అనుమతించింది. దీని కింద ఏవైనా రెండు దేశాలు కోవిడ్-19 మహమ్మారి కారణంగా రద్దైన సర్వీసులను పున: ప్రారంభించుకోవచ్చు. మే 25న హైదరాబాద్ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు పున:ప్రారంభమైన నాటి నుంచి జీఎమ్ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం సురక్షితమైన ప్రయాణం కొరకు డిపార్చర్ ర్యాంప్ నుంచి బోర్డింగ్ గేటు వరకు పూర్తి శానిటైజ్ చేయబడిన కాంటాక్ట్-లెస్తో ప్రయాణికుల బధ్రతకు భరోసా కల్పిస్తుంది. -
జీవీకే, జీఎంఆర్ విమానాశ్రయాలకు అవార్డులు
న్యూఢిల్లీ: జీవీకే, జీఎంఆర్‌కు చెందిన ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాలు పలు విభాగాల్లో ప్రపంచంలోనే మేటి ఎయిర్‌పోర్టులుగా నిలిచి ‘ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డులను’ సొంతం చేసుకున్నాయి. ఇందులో జీవీకే గ్రూపు ఆధ్వర్యంలోని ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (సీఎస్ఐఏ) ‘కస్టమర్ల అనుభవం’లో ప్రపంచంలోనే మేటి విమానాశ్రయంగా నిలిచింది. అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి (ఏసీఐ) నిర్వహించిన సర్వేలో లక్షల మంది ప్రయాణికులు ఈ విషయంలో సీఎస్ఐఏకు ఓటేశారు. అంతర్జాతీయ విమానాశ్రయాల మండలిలో 176 దేశాలకు చెందిన 1,953 విమానాశ్రయాలకు సభ్యత్వం ఉంది. 4 కోట్లకు పైగా ప్రయాణికులు.. ఢిల్లీ నెంబర్ 1 జీఎంఆర్ గ్రూపు నిర్వహణలోని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఐజీఐఏ) ఏటా 40 మిలియన్లకు పైగా ప్రయాణికుల రాకపోకలతో... ఈ విభాగంలో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానం దక్కించుకుంది. ఈ మేరకు ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డు సొంతం చేసుకున్నట్టు జీఎంఆర్ ఆధ్వర్యంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెలిపింది. కోటిన్నర లోపు ప్రయాణికులు... శంషాబాద్‌కే ఓటు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి ప్రపంచ అత్యుత్తమ ఎయిర్‌పోర్టు అవార్డును దక్కించుకుంది. ఏటా ఐదు నుంచి పదిహేను మిలియన్ల ప్రయాణికుల విభాగంలో అందిస్తున్న సేవలకు గాను ఈ అవార్డు లభించింది. -
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ సీఎఫ్‌వోకు 18 నెలల జైలు
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ చెక్ బౌన్స్ కేసులో.. సాక్షి, హైదరాబాద్: జీఎంఆర్ ఎయిర్‌పోర్టుకు చెల్లించాల్సిన చార్జీలకు సంబంధించి ఇచ్చిన రెండు చెక్కులు బౌన్స్ అయిన కేసులో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ సీఎఫ్‌వో రఘునాథన్‌కు హైదరాబాద్‌లోని ప్రత్యేక కోర్టు 18 నెలల జైలు శిక్ష విధించింది. అలాగే రూ.40 వేలు జరిమానా చెల్లించాలని న్యాయమూర్తి ఎం.క్రిష్ణారావు గురువారం తీర్పునిచ్చారు. గతంలోనే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్‌మాల్యా, రఘునాథన్‌లపై చెక్‌బౌన్స్‌కు సంబంధించిన నేరం రుజువైంది. అయితే శిక్ష కాలాన్ని ఖరారు చేసేందుకు వీరిద్దరినీ వ్యక్తిగతంగా హాజరుపర్చాలని పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి అరెస్టు వారెంట్లు జారీచేశారు. ఈ వారంట్లు గత ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. విజయ్‌మాల్యా దేశం బయట ఉన్నాడని పోలీసులకు కోర్టుకు నివేదించారు. అయితే పలు కోర్టుల్లో వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉన్నందున ఇక్కడి కోర్టుకు రఘునాథన్ హాజరు కాలేకపోయారని, విజయ్‌మాల్యా దేశం బయట ఉన్నందున ఈ కేసును విడదీసి (స్ల్పిట్) తీర్పు ఇవ్వాలని రఘునాథన్ తరఫు న్యాయవాది నివేదించారు. ఈ నేపథ్యంలో రఘునాథన్ గురువారం హాజరుకావడంతో న్యాయమూర్తి ఆయనకు శిక్షను ఖరారు చేశారు. కింగ్‌ఫిషన్ ఎయిర్‌లైన్స్ రూ.22.5 కోట్లకు ఇచ్చిన 17 చెక్కులు బౌన్స్ అయ్యాయని, ఈ కేసులు విచారణలో ఉన్నాయని జీఎంఆర్ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి తెలిపారు. ఈ కేసులో మరో నిందితునిగా ఉన్న విజయ్‌మాల్యా ఎక్కడున్నారో అందరికీ తెలుసని, ఆయన భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం లేదని, ఆయన్ను భారత్‌కు తీసుకురావడానికి అనేక సంవత్సరాలు పట్టవచ్చని తెలిపారు. ఈ కేసులో ఒక నిందితుడు హాజరైన నేపథ్యంలో విజయ్‌మాల్యాకు కూడా శిక్ష ఖరారు చేయాలని నివేదించారు. అలాగే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు జరిమానా విధించాలని కోరారు. -
మాల్యా కేసులో తీర్పు 9కి వాయిదా!
సాక్షి, హైదరాబాద్: కింగ్‌ఫిషర్ మాజీ అధిపతి విజయ్ మాల్యాపై చెక్ బౌన్స్ కేసులో తీర్పును హైదరాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానం వాయిదా వేసింది. జీఎంఆర్ విమానాశ్రయాన్ని వాడుకున్నందుకు కింగ్‌ఫిషర్ సంస్థ గతంలో రూ.25 కోట్లకుగాను 17 చెక్కులు జారీ చేసింది. వీటిలో రూ.50 లక్షల చెక్కులు రెండు బౌన్సయ్యాయి. దీనిపై జీఎంఆర్ సంస్థ కేసు దాఖలు చేసింది. విచారణ అనంతరం మాల్యా నేరాన్ని కోర్టు ఇప్పటికే నిర్థారించింది. శిక్ష ఖరారు చేయటానికి మాల్యా వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ వారెంట్లు జారీ చేసింది. ‘‘మాల్యా విదేశాల్లో ఉన్నారు. వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. రాజ్యసభ సభ్యత్వం కూడా రద్దయింది. ఆయన వ్యక్తిగతంగా హాజరు కాకపోయినా శిక్ష ఖరారు చేయండి’’ అని జీఎంఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. తీర్పును ఈ నెల 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఎర్రమంజిల్‌లోని 3వ ప్రత్యేక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కృష్ణారావు పేర్కొన్నారు. -
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌లో వాటాల పునర్వ్యవస్థీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్‌లో వాటాలను పునర్ వ్యవస్థీకరిస్తున్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా ప్రకటించింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో పెట్టుబడి పెట్టిన పీఈ ఇన్వెస్టర్ల వాటాను జీఎంఆర్ ఇన్ఫ్రా జూన్ 5, 2017లోగా కొనుగోలు చేయనుంది. కాల్ ఆప్షన్ రైట్స్‌లో భాగంగా పీఈ ఇన్వెస్టర్ల వాటాను కన్వర్టబుల్ ఈక్విటీలుగా మార్చుకోనున్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. -
అమ్మకానికి జీఎంఆర్ ఎయిర్పోర్ట్ వాటా!
30 శాతం వాటా విక్రయం ద్వారా రూ.3,500 కోట్ల సమీకరణ లక్ష ్యం ఎయిర్‌పోర్టు వ్యాపారం ప్రస్తుత విలువ రూ. 10,000 కోట్లుగా అంచనా వాటా విక్రయం ప్రణాళిక ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని కంపెనీ వివరణ... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో :అప్పులను తగ్గించుకోవడానికి ఎయిర్‌పోర్టు వ్యాపారంలో వాటాలను విక్రయించాలని జీఎంఆర్ గ్రూపు నిర్ణయించింది. జీఎంఆర్ ఆనుబంధ కంపెనీగా ఉన్న జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసి స్టాక్ మార్కెట్లో నమోదు చేయడమో, లేక పీఈ ఇన్వెస్టర్లకు వాటాలు విక్రయించటమో చేయటం ద్వారా నిధులు సేకరించే ప్రయత్నంలో కంపెనీ ఉంది. వచ్చే ఏడాది కాలంలో ఎయిర్పోర్ట్ వ్యాపారంలో వాటాలను విక్రయించడం ద్వారా కనీసం రూ. 3,500 నుంచి రూ. 4,500 కోట్లు సమీకరించాలన్నది కంపెనీ లక్ష్యంగా ఉంది. ఈ నిధుల సేకరణకు ముఖ్య సలహాదారుగా క్రెడిట్ సూసీ సంస్థను నియమించినట్లు సమాచారం. ప్రస్తుతం జీఎంఆర్ ఎయిర్‌పోర్టు వ్యాపార విలువను రూ. 10,000 కోట్లుగా మదింపు వేసినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో కనీసం 30 శాతం వాటాను మార్చిలోగా విక్రయించడం ద్వారా కనీసం రూ.3,500 కోట్ల నుంచి రూ. 4,500 కోట్లు సమీకరించాలన్నది కంపెనీ ఆలోచన. ఇప్పటికే జీఎంఆర్ ఎయిర్‌పోర్టులో పెట్టుబడి పెట్టిన వారు వైదొలగడానికి అవకాశం కల్పించడంతోపాటు, అప్పులను తీర్చుకోవడానికి ఈ వాటాల విక్రయాన్ని వాడుకోవాలనేది కంపెనీ ఆలోచనగా ఉంది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో మెక్వైరీ ఎస్బీఐ ఇన్ఫ్రా, స్టాండర్డ్ చార్టర్డ్ ప్రైవేట్ ఈక్విటీ, జేఎం ఫైనాన్షియల్స్ వంటి పీఈ సంస్థలు సుమారు రూ. 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేయటం తెలిసిందే. వేగంగా విస్తరిస్తున్న దేశీయ విమానయానరంగంలో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. సింగపూర్‌కు చెందిన చాంగీ ఎయిర్‌పోర్ట్‌తో పాటు ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, కేకేఆర్ వంటి సంస్థలు 30 శాతం వాటాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు మార్కెట్లో వినిపిస్తుండగా... కంపెనీ ప్రతి నిధులు మాత్రం దీన్ని ఖండిం చారు. వాటాల విక్రయం ఇంకా ప్రాథమిక చర్చల దశలోనే ఉందని, హడావిడిగా వాటాలను విక్రయించే ఉద్దేశం లేదని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. సగం ఆదాయం ఎయిర్‌పోర్టు నుంచే... విద్యుత్, రోడ్లు, ఎయిర్పోర్ట్ వంటి విభిన్న వ్యాపారాల్లో ఉన్న జీఎంఆర్ గ్రూపునకు ఇప్పుడు ప్రధాన ఆదాయ వనరుగా ఎయిర్‌పోర్టు విభాగం ఎదిగింది. గతేడాది మొత్తం వ్యాపారంలో 49 శాతం ఆదాయం ఎయిర్‌పోర్టుల నుంచే వచ్చింది. 2014-15లో జీఎంఆర్ గ్రూపు ఆదాయం రూ. 11,088 కోట్లుకాగా, ఎయిర్పోర్ట్ నుంచి రూ.5,468 కోట్లు సమకూరింది. ప్రస్తుతం జీఎంఆర్ గ్రూపు ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులతో పాటు, ఫిలిఫైన్స్‌లో ఎయిర్‌పోర్టును నిర్వహిస్తోంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 64 శాతం వాటాను, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 63 శాతం, ఫిలిఫైన్స్ మక్టన్ సెబూ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో 40 శాతం వాటా జీఎంఆర్‌కు ఉంది. పూర్తి అప్పుల ఊబిలో ఉన్న కంపెనీ ఆస్తులను విక్రయించడం ద్వారా రుణ భారాన్ని తగ్గించుకునే పనిలో ఉంది. మార్చిలోగా అప్పులను 30 నుంచి 40 శాతం తగ్గించుకోవాలన్నది కంపెనీ ఆలోచన. సెప్టెంబర్ మాసాంతానికి జీఎంఆర్ గ్రూపు రుణాలు రూ. 40,500 కోట్లు. రెండు రోజుల క్రితమే ఎఫ్‌సీసీబీలు జారీ చేసి రూ. 2,000 కోట్లు సమీకరించింది. -
ఐపీవోకి జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లాభాల్లో ఉన్న ఎయిర్పోర్ట్ వ్యాపారాన్ని విభజించి పబ్లిక్ ఇష్యూ జారీ చేసే యోచనలో జీఎంఆర్ ఇన్ఫ్రా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయడం ద్వారా కనీసం రూ.2,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ పబ్లిక్ ఇష్యూ బాధ్యతను సిటీగ్రూపు, జేపీమోర్గాన్, యాక్సిస్ క్యాపిటల్, ఐడీఎఫ్సీలకు అప్పచెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయమై జీఎంఆర్ అధికారులను సంప్రదించగా, ఇవి పూర్తిగా ఊహాగానాలని, ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జీఎంఆర్ ఇన్ఫ్రా దేశంలో న్యూఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులతో పాటు, టర్కీలోని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టును నిర్వహిస్తోంది. జీఎంఆర్ ఇన్‌ఫ్రాకి చెందిన విద్యుత్, ఇన్ఫ్రా వంటి అన్ని విభాగాలు భారీ నష్టాలను అందిస్తే ఎయిర్‌పోర్టు వ్యాపారం లాభాలను కురిపించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో జీఎంఆర్ ఎయిర్‌పోర్టు విభాగం రూ. 125 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఆదాయం కూడా రూ.2,792 కోట్ల నుంచి రూ.2,870 కోట్లకు పెరిగింది. జీఎంఆర్ చేతికి ఫిలిప్పీన్స్ ఎయిర్పోర్ట్ రూ.2,500 కోట్ల పెట్టుబడి అంచనాతో అభివృద్ధి చేయనున్న ఫిలిప్పీన్స్‌లోని మక్టన్- సెబు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు బిడ్డింగ్‌లో తమ కన్సార్టియం అగ్రస్థానంలో నిలిచినట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా ఒక ప్రకటనలో తెలిపింది. మెగావైడ్ కార్పొరేషన్‌తో కలిసి ఈ బిడ్డింగ్‌లో పాల్గొన్నామని, గురువారం బిడ్డింగ్‌లు తెరిచి చూడగా తాము మొదటి స్థానంలో నిలిచినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. కాని ఈ సమాచారం ఇంకా అధికారికంగా అందాల్సి ఉందన్నారు.