హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లాభాల్లో ఉన్న ఎయిర్‌పోర్ట్ వ్యాపారాన్ని విభజించి పబ్లిక్ ఇష్యూ జారీ చేసే యోచనలో జీఎంఆర్ ఇన్‌ఫ్రా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయడం ద్వారా కనీసం రూ.2,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ పబ్లిక్ ఇష్యూ బాధ్యతను సిటీగ్రూపు, జేపీమోర్గాన్, యాక్సిస్ క్యాపిటల్, ఐడీఎఫ్‌సీలకు అప్పచెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయమై జీఎంఆర్ అధికారులను సంప్రదించగా, ఇవి పూర్తిగా ఊహాగానాలని, ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జీఎంఆర్ ఇన్‌ఫ్రా దేశంలో న్యూఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులతో పాటు, టర్కీలోని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టును నిర్వహిస్తోంది. జీఎంఆర్ ఇన్‌ఫ్రాకి చెందిన విద్యుత్, ఇన్‌ఫ్రా వంటి అన్ని విభాగాలు భారీ నష్టాలను అందిస్తే ఎయిర్‌పోర్టు వ్యాపారం లాభాలను కురిపించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో జీఎంఆర్ ఎయిర్‌పోర్టు విభాగం రూ. 125 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఆదాయం కూడా రూ.2,792 కోట్ల నుంచి రూ.2,870 కోట్లకు పెరిగింది.
జీఎంఆర్ చేతికి ఫిలిప్పీన్స్ ఎయిర్‌పోర్ట్
రూ.2,500 కోట్ల పెట్టుబడి అంచనాతో అభివృద్ధి చేయనున్న ఫిలిప్పీన్స్‌లోని మక్టన్- సెబు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు బిడ్డింగ్‌లో తమ కన్సార్టియం అగ్రస్థానంలో నిలిచినట్లు జీఎంఆర్ ఇన్‌ఫ్రా ఒక ప్రకటనలో తెలిపింది. మెగావైడ్ కార్పొరేషన్‌తో కలిసి ఈ బిడ్డింగ్‌లో పాల్గొన్నామని, గురువారం బిడ్డింగ్‌లు తెరిచి చూడగా తాము మొదటి స్థానంలో నిలిచినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. కాని ఈ సమాచారం ఇంకా అధికారికంగా అందాల్సి ఉందన్నారు.
ఐపీవోకి జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌లు!
Published Fri, Dec 13 2013 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement
Advertisement