రూ. 2,500 కోట్ల సమీకరణలో జీఎంఆర్ ఇన్ఫ్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తాజాగా ఈక్విటీ షేర్లు, ఈక్విటీ ఆధారిత సాధనాలు, డిబెంచర్లు మొదలైన వాటి జారీ ద్వారా రూ. 2,500 కోట్ల దాకా సమీకరించనుంది. వచ్చే నెల 14న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ప్రతిపాదనకు షేర్‌హోల్డర్ల అనుమతి కోరనున్నట్లు సంస్థ వెల్లడించింది. దాదాపు రూ. 40,000 కోట్ల పైచిలుకు ఉన్న రుణభారాన్ని తగ్గించుకునే దిశగా జీఎంఆర్ కొన్ని ప్రాజెక్టుల్లో వాటాలు విక్రయిస్తూ వస్తోంది. కొన్నాళ్ల క్రితమే విద్యుత్ విభాగానికి సంబంధించి 30 శాతం వాటాలను మలేషియాకి చెందిన టెనగా నేషనల్‌కి విక్రయించింది. హైదరాబాద్ విమానాశ్రయంలోనూ వాటాలు విక్రయించే ప్రయత్నాల్లో కంపెనీ ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.