
జీఎంఆర్‌లో కువైట్ సంస్థ 2 వేల కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ కంపెనీ జీఎంఆర్ ఇన్‌ఫ్రా విదేశీ బాండ్ల ద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించింది. కువైట్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ 60 ఏళ్ల ఫారన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ ద్వారా 300 మిలియన్ డాలర్లు ( రూ. 2,000 కోట్లు) ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరినట్లు జీఎంఆర్ ఇన్‌ఫ్రా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 7.5 శాతం కూపన్ రేటు మీద ఈ నిధులను సేకరించారు. ఈ డిబెంచర్స్ కాలపరిమితి 60 ఏళ్లు అయినప్పటికీ 18 నెలల తర్వాత ఎప్పుడైనా ఈక్విటీగా మార్చుకునే వెసులుబాటు ఉంది. కంపెనీ చరిత్రలో ఇదో అతిపెద్ద ద్వైపాక్షిక ఒప్పందమని, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న దీర్ఘకాలిక ప్రణాళికలపై విదేశీయులు కనబరుస్తున్న నమ్మకానికి ఇదొక ఉదాహరణ అని జీఎంఆర్ గ్రూపు చైర్మన్ జి.ఎం.రావు పేర్కొన్నారు. ఈ విధంగా సేకరించిన మొత్తంలో రూ. 1,500 కోట్లు రుణాలను తీర్చడానికి జీఎంఆర్ వినియోగించనుంది. దీంతో కంపెనీ కన్సాలిడేటెడ్ రుణం రూ.
6,900 కోట్ల నుంచి రూ. 5,400 కోట్లకు తగ్గుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. గత రెండేళ్లలో జీఎంఆర్ ఇన్‌ఫ్రా రూ. 10,700 కోట్ల నిధులను సమీకరించింది. రానున్న కాలంలో దేశీయ ఇన్‌ఫ్రా రంగంలో మరింత ముందుకు పోవడానికి ముందుగా జీఎంఆర్‌ను ఎంచుకున్నట్లు కువైట్ ఇన్వెస్ట్‌మెంట్ అథార్టీ ప్రతినిధి ఫరూఖ్ బస్తకి తెలిపారు.
నిధుల సమీకరణ వార్తల నేపథ్యంలో శుక్రవారం జీఎంఆర్ ఇన్‌ఫ్రా షేరు బీఎస్‌ఈలో 15 శాతం నష్టపోయి రూ. 15.45 వద్ద ముగిసింది.