ఈ నెల 8 నుంచీ మళ్లీ పసిడి బాండ్లు
న్యూఢిల్లీ: పసిడి బాండ్ల పథకం మూడవ విడతకు వచ్చే మంగళవారం నాడు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఆర్థిక మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యాంశాలు చూస్తే...
♦ బాండ్లకు దరఖాస్తులను మార్చి 8వ తేదీ నుంచీ 14వ తేదీవరకూ సమీకరిస్తారు. మార్చి 29న బాండ్లను జారీ చేస్తారు.
♦ బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సీఐఎల్), గుర్తింపు పొందిన పోస్టాఫీసుల్లో బాండ్ల విక్రయం జరుగుతుంది.
♦ సావరిన్ గోల్డ్ బాండ్లపై మొత్తాలను తిరిగి చెల్లించే సమయంలో వ్యక్తులకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుందని 2016-17 బడ్జెట్ ప్రతిపాదిస్తోంది.
♦ 5, 10, 50, 100 గ్రాములు డినామినేషన్లలో 5-7 ఏళ్ల కాలానికి బాండ్లు జారీ అవుతాయి.
♦ ఒక వ్యక్తి వార్షికంగా 500 గ్రాములకన్నా అధికంగా బాండ్ల కొనుగోలుకు అవకాశం లేదు.
♦ పెట్టుబడుల సమయంలో మెటల్ విలువ ప్రాతిపదికన వడ్డీరేటును లెక్కిస్తారు.
♦ తొలి విడత స్కీమ్‌లో 916 కేజీల పరిమాణంలో బాండ్ల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.246 కోట్లు సమీకరించింది.
♦ రెండో విడతలో ఇది 3,071 కేజీలకు చేరింది. తద్వారా రూ.798 కోట్లు ప్రభుత్వం సమీకరించింది.