బడ్జెట్‌లో బంగారంపై దిగుమతి పన్ను తగ్గింపుకు అవకాశం(ఫైల్)
ముంబై : ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం కొనుగోలుదారుగా ఉన్న భారత్‌లో రోజురోజుకి ధరలు పైపైకి ఎగుస్తున్నాయి. మరో రెండు రోజుల్లో కేంద్ర వార్షిక బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టబోతుంది. దీంతో పెరుగుతున్న ధరలకు చెక్‌పెట్టడానికి, అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం సమర్పించనున్న బడ్జెట్‌లో దిగుమతి పన్నును తగ్గించే అవకాశాలున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కూడా పన్ను తగ్గింపు అవసరమని బులియన్ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. తక్కువ దిగుమతి పన్నుతో దేశీయంగా బంగారం డిమాండ్‌ను పెంచవచ్చనీ పేర్కొంటున్నాయి. కరెంట్ అకౌంట్ లోటును తగ్గించేందుకు 2013 ఆగస్టులో దిగుమతి డ్యూటీని భారత్ 10 శాతం పెంచిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం బంగారంపై దిగుమతి పన్నును 2 నుంచి 4 శాతం తగ్గించే అవకాశముందని తాము అంచనావేస్తున్నట్టు ఇండియన్ బులియన్ జువెల్లర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ గాడ్జిల్ తెలిపారు. ఎక్కువ దిగుమతి డ్యూటీతో గ్రే ఛానల్స్ ఎక్కువవుతాయని, అక్రమ రవాణాకు, అనధికారిక విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ తగ్గింపు అవసరమని పేర్కొన్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం 2016లో భారత్‌కు దాదాపు 120 టన్నుల బంగారాన్ని స్మగ్లర్లు రవాణా చేసినట్టు తెలిసింది. 10 శాతం దిగుమతి పన్నును ఆదా చేసుకునేందుకు స్మగ్లర్లు 1 శాతం లేదా 2 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తారని, కానీ తాము ఎలాంటి డిస్కౌంట్లు ఇవ్వకుండా.. డ్యూటీలను చెల్లిస్తామని కోల్‌కత్తాకు చెందిన హోల్‌సేల్, జేజే గోల్డ్ హౌజ్ ప్రొప్రైటర్ హర్షద్ అజ్మిరా చెప్పారు. పన్ను ఎగవేతదారులు ఎక్కువగా అక్రమ బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారని, వారు 3 శాతం జీఎస్టీని కూడా చెల్లించరని చెన్నైకు చెందిన హోల్‌సేల్ ఎంఎన్‌సీ బులియన్ డైరెక్టర్ ప్రకాశ్ రాథోడ్ అన్నారు. తొలుత ప్రభుత్వం 10 శాతం దిగుమతి పన్నును, అనంతరం జీఎస్టీని కోల్పోతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో పన్ను తగ్గింపు చేపట్టాలని బులియన్ పరిశ్రమ పట్టుబడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment