
పసిడి మెరుపుపై అమెరికా ఫెడ్ నీడ: నిపుణులు
న్యూఢిల్లీ/న్యూయార్క్: అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్.. ఫండ్ రేటును పెంచుతుందన్న అంచనాలు అంతర్జాతీయంగా పసిడిపై ఒకపక్క ప్రతికూల ప్రభావాన్ని కొనసాగిస్తుండగా... దేశీయంగా మార్కెట్ జరుపుతున్న ర్యాలీ ప్రభావమూ ఈ విలువైన మెటల్‌పై కనబడుతోంది. సమీపకాలంలో కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని ఈ రంగంలో నిపుణులు పేర్కొంటున్నారు. న్యూయార్క్ కమోడిటీ మార్కెట్ నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న జూన్ డెలివరీ ఔన్స్ (31.1గ్రా) ధర వారంవారీగా శుక్రవారం అంతక్రితం వారంతో పోల్చితే 16 డాలర్లు తగ్గి 1,213 డాలర్లకు చేరింది. గతవారం కూడా ధర దాదాపు 21 డాలర్లు పడిపోయింది.
మూడు వారాల క్రితం దాదాపు 1,300 డాలర్లకు చేరిన ధర.. ఫెడ్ ఫండ్ రేటు పెంపు అంచనాల నేపథ్యంలో భారీగా పడిపోవడం గమనార్హం. గతనెల్లో సమావేశమైన అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) సమావేశ మినిట్స్ వివరాల ప్రకారం- ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆందోళనలు కొంత తగ్గుతున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ కొంత ఆశావహంగా ముందుకు నడిచే అవకాశం ఉంది. ఫెడ్ అభిప్రాయాల నేపథ్యంలో- త్వరలో ఫండ్ రేటు ప్రస్తుత 0.50 శాతం స్థాయి నుంచి పెరిగే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమీపకాలంలో పసిడిలో అమ్మకాల ఒత్తిడి నెలకొన వచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. డాలర్ బలపడిన ప్రభావం సైతం రెండు వారాలుగా పసిడిపై ప్రభావం చూపిస్తోంది.
దేశీయంగా రూ.1,000 డౌన్...
ఇక దేశీయంగా పసిడికి కొనుగోలు మద్దతు కొరవడింది. దీనికితోడు అంతర్జాతీయ ప్రభావం, ఈక్విటీ మార్కెట్ల పరుగుకూడా దేశీయంగా పసిడి ధరను వెనక్కు నెడుతున్న అంశం. ముంబై ప్రధాన మార్కెట్‌లో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర వారం వారీగా భారీగా రూ.1,000 (3.34 శాతం) తగ్గింది. రూ.28,905 వద్ద ముగిసింది. ఇక 99.5 స్వచ్ఛత ధర సైతం ఇదే స్థాయిలో తగ్గి రూ.28,775 వద్ద ముగిసింది. ఇక వెండి కేజీకి రూ.1,040 (3 శాతం) పడిపోయి రూ.39,355 వద్ద ముగిసింది.