సమీపంలో పసిడి పటిష్టమే..!
న్యూయార్క్/ముంబై: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పసిడి తళతళలాడుతోంది. సమీప కాలంలో ప్రత్యేకించి తాజా వారంలో పసిడి ధర పటిష్ట ధోరణిలోనే కొనసాగుతుందన్న విశ్వాసాన్ని ఈ రంగంలో నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి సంబంధించి ఈ నెల 23వ తేదీన జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణ ప్రభావం ప్రధానంగా రానున్న ఐదారురోజుల్లో పసిడి ధరపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనావేస్తున్నారు.
అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్‌లో ధర ఔన్స్‌కు (31.1గ్రా) వారం వారీగా 25 డాలర్లు పెరిగి 1,302 డాలర్ల వద్ద ముగిసింది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి.
దేశీయంగా భారీ లాభం...
ఇక అంతర్జాతీయంగా దూకుడు... దేశంలో కొనుగోళ్ల మద్దతు నేపథ్యంలో ముంబై ప్రధాన బులియన్ స్పాట్ మార్కెట్‌లో పసిడి ధర శుక్రవారంతో ముగిసిన వారంలో భారీగా లాభపడింది. 10 గ్రాములు 99.9 స్వచ్ఛత ధర వారం వారీగా శుక్రవారం భారీగా రూ.470 లాభంతో రూ. 30,060 వద్ద ముగియగా, 99.5 స్వచ్ఛత ధర సైతం అంతే స్థాయిలో లాభపడి రూ.29,910 వద్ద ముగిసింది. ఇక వెండి కేజీ ధర రూ.510 లాభపడి, రూ. 41,560 వద్ద ముగిసింది. వారంలో ఒక దశలో ధర 2014 సెప్టెంబర్ 10 గరిష్ట స్థాయి రూ.42,570కి ఎగయడం గమనార్హం. ధరల పటిష్ట ధోరణి దేశీయంగా కొనసాగే వీలుంది.
ఇన్వెస్టర్లకు పసిడే ప్రత్యామ్నాయం
భౌగోళిక అంశాలు ఎప్పుడూ పసిడిపై ప్రభావం చూపుతూనే ఉంటాయి. బ్రిగ్జిట్ ఇందులో ఒకటి. అమెరికాలో ఉపాధి అవకాశాల సంఖ్య తగ్గడం నుంచీ ప్రారంభమైన పసిడి తాజా ర్యాలీ బ్రిగ్జిట్ వరకూ కొనసాగుతుంది. ఈ అనిశ్చితి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల భద్రతకు పసిడినే ఎంచుకుంటారు. ఒకవేళ బ్రిగ్జిట్‌కు ప్రతికూలంగా ఓటు పడినా... పసిడి భారీగా పడిపోయే అవకాశాలూ ఏమీ లేవు. అయితే ఏ స్థాయి వరకూ పెరుగుతాయన్నదే ప్రస్తుత ప్రశ్న.
- కియూర్ షా, ముథూట్, ప్రీసియస్ మెటల్స్ డివిజన్, సీఈఓ
‘యస్’ ఓటయితే... 1,400 డాలర్లకే
యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోడానికే బ్రిటన్ ఓటేస్తే... పసిడి ఔన్స్‌కు 1,400 డాలర్ల వైపునకు దూసుకుపోవడం ఖాయం. ఇది 1,350-1,400 డాలర్ల శ్రేణిలో ఉంటుంది. దేశీయ మార్కెట్‌లో ఈ ధరల శ్రేణి రూ.31,800-రూ.32,500 మధ్య ఉంటుంది. ‘‘నో’ ఓటు అయితే దేశీయంగా ధర రూ.30,600-రూ.30,400 మధ్య ఉంటుంది. ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల్లో పసిడి ధర భారీగా పడిపోదన్న అంశంపై విశ్లేషకుల్లో ఏకాభిప్రాయం ఉంది.
- నవ్‌నీత్ దమానీ, మోతీలాల్ ఓస్వాల్, కమోడిటీ డివిజన్, ఏవీపీ