కొనసాగుతున్న పసిడి పతనం..
ఆరేళ్ల కనిష్టానికి అంతర్జాతీయ ధర
వడ్డీ రేట్ల పెంపుపై ఫెడ్ సంకేతాల ప్రభావం
దేశీయంగానూ మరింత దిగొచ్చిన పుత్తడి...
లండన్: వడ్డీరేట్లను పెంచేందుకు సిద్ధంగా ఉందంటూ... అమెరికా సెంట్రల్ బ్యాంక్... ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జానెట్ ఎలెన్ చేసిన వ్యాఖ్య అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరపై ప్రతికూల ప్రభావం చూపింది. ఔన్స్ (31.1గ్రా) ధర 0.7 శాతం తగ్గి దాదాపు ఆరేళ్ల కనిష్ట స్థాయి 1,046 డాలర్లకు పడింది. 2010 ఫిబ్రవరి తరువాత ఈ స్థాయికి ధర తగ్గడం ఇదే తొలిసారి. వెండి సైతం 1.2 శాతం పడిపోయి 13.84 డాలర్లకు తగ్గింది. 2009 ఆగస్టు తరువాత ఈ స్థాయికి వెండి ధర పతనం ఇదే మొదటిసారి. ఎలెన్ వ్యాఖ్యలతో బులియన్ ఆధారిత ఫండ్లను ఇన్వెస్టర్లు గత రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా అమ్మడం తాజా పరిస్థితికి కారణం.
బుధవారం నాడు ఎలెన్ మాట్లాడుతూ, జీరో స్థాయి రుణ వ్యయాల వ్యవస్థకు ముగింపు పలికే సమయం ఆసన్నమైందన్నారు. ఆమె తాజా వ్యాఖ్యలతో ఇన్వెస్టర్లు గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ప్రొడక్ట్స్‌లో విక్రయాలను ముమ్మరం చేశారు. ఒక్కసారిగా 16.2 మెట్రిక్ టన్నుల గ్లోబల్ హోల్డింగ్స్ నుంచి తప్పుకున్నారు. ఇంత భారీ స్థాయిలో అమ్మకాలు 2013 జూలై తరువాత ఇదే తొలిసారి. తాజా పరిణామంతో హోల్డింగ్స్ పరిమాణం 1,474 టన్నులకు తగ్గినట్లు బుధవారం గణాంకాలు వెల్లడించాయి. కాగా ఫెడ్ రిజర్వ్ చీఫ్ వ్యాఖ్యలు పలు ప్రధాన స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ముగియడానికి, డాలర్ బలపడ్డానికి కూడా దారితీసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో జరగనున్న ఫెడ్ పాలసీ సమీక్షపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం జీరో స్థాయిలో ఉన్న ఫెడ్ ఫండ్ రేటు పెంపు ఈ దఫా ఖాయమన్నది పలువురి విశ్లేషణ.
దేశీయంగా భారీ పతనం...
కాగా అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం దేశీయంగా కనబడుతోంది. ముంబై ప్రధాన బులియన్ స్పాట్ మార్కెట్‌లో పసిడి ధర గురువారం 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు బుధవారం ముగింపుతో పోల్చితే రూ.310 తగ్గి రూ.25,035కు చేరింది. 99.5 స్వచ్ఛత కూడా ఇదే స్థాయిలో పడి రూ.24,885కు దిగింది. ఈ రేట్లు మూడున్నర నెలల కనిష్టస్థాయి కావడం గమనార్హం. వెండి కేజీ ధర రూ.355 తగ్గి, రూ.34,310కి చేరింది.