న్యూఢిల్లీ: బంగారం ధర జోరుమీద కొనసాగుతోంది. గతకొద్ది రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర సోమవారం ఏకంగా జీవితకాల గరిష్టస్థాయిని తిరగరాసింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల (బిస్కెట్ గోల్డ్) బంగారం ధర రూ.35,970 చేరుకుంది. ప్రాంతీయ నగల వ్యాపారుల నుంచి డిమాండ్ క్రమంగా పెరిగిన కారణంగా ఇక్కడి ధర రూ.100 పెరిగి ఆల్ టైం రికార్డు హైకి చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురేంద్ర జైన్ పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు పతనమౌతున్నందున ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారం వైపునకు మళ్లడమే డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణంగా విశ్లేషించారు. మరోవైపు సావరిన్ గోల్డ్ ధర కూడా రూ.100 పెరిగి రూ.35,870 వద్దకు చేరుకుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర సోమవారం ఒక దశలో 1,430.35 డాలర్ల గరిష్టస్థాయిని నమోదుచేసింది.
వెండి వెలుగులే..
బంగారం దారిలోనే వెండి ధరలు ప్రయాణం చేస్తున్నాయి. స్పాట్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.260 పెరిగి రూ.41,960 చేరుకోగా.. వీక్లీ డెలివరీ సిల్వర్ ధర రూ.391 పెరిగి రూ.41,073 వద్దకు ఎగబాకింది. 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.84,000 కాగా, అమ్మకం ధర రూ.85,000. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు ధర 16.62 డాలర్లకు ఎగసింది.
Comments
Please login to add a commentAdd a comment