బంగారం హైజంప్..
ఢిల్లీ మార్కెట్లో రూ. 840 అప్
ఒకే రోజు ఇంత పెరగడం ఈ ఏడాది ఇదే ప్రథమం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా భారత్‌లో కూడా పసిడి ధర గణనీయంగా పెరిగింది. మంగళవారం పది గ్రాముల పసిడి రేటు ఏకంగా రూ. 840 పెరిగింది. ఒక్క రోజులో బంగారం ధర ఇంత పెరగడం ఈ ఏడాదిలో ఇదే మొదటిసారి. తాజా పెరుగుదలతో దాదాపు నెల రోజుల తర్వాత న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో బంగారం మళ్లీ రూ. 27,000 మార్కును దాటింది. మేలిమి బంగారం (99.9 శాతం స్వచ్ఛత) పది గ్రాముల ధర రూ. 27,040 వద్ద ముగిసింది.
చివరిగా అక్టోబర్ 30న న్యూఢిల్లీ మార్కెట్లో పసిడి ఈ రేటు వద్ద కదలాడింది. మరోవైపు, తాజాగా ఆభరణాల బంగారం రూ. 26,840 వద్ద ముగిసింది. వరుసగా ఆరు సెషన్లలో పసిడి ధర రూ. 730 మేర క్షీణించిన సంగతి తెలిసిందే. అయితే దిగుమతులపై పరిమితులను ఆర్‌బీఐ సడలించడం ప్రస్తుతం మళ్లీ ఊపునిచ్చింది. ఇక వివాహాల సీజన్ నేపథ్యంలో దేశీయంగా డిమాండు పెరగడమూ పసిడికి కలిసొచ్చింది. ఇక పారిశ్రామిక సంస్థలు, నాణేల తయారీ సంస్థల నుంచి డిమాండ్‌తో వెండి కూడా కిలో ధర రూ.2,700 పెరిగి రూ. 37,000 వద్ద ముగిసింది.
ముంబై మార్కెట్లోనూ..: స్టాకిస్టులు, ఆభరణాల వ్యాపారుల నుంచి డిమాండ్‌తో ముంబై మార్కెట్లోనూ పసిడి రేటు పెరిగింది. 10 గ్రాముల మేలిమి బంగారం రూ.370 పెరిగి రూ.26,485 వద్ద, ఆభరణాల బంగారం కూడా అంతే పెరిగి రూ.26,335 వద్ద ముగిసింది. వెండి ధర కిలోకు రూ.850 మేర పెరిగి రూ.36,965 వద్ద ముగిసింది.