బంగారానికి భలే జోష్
బంగారానికి భలే జోష్
Published Fri, Aug 11 2017 12:00 PM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM
లండన్ : అమెరికా, ఉత్తర కొరియాల మధ్య చోటుచేసుకున్న భయాంనక వాతావరణం బంగారానికి భలే జోష్ ఇచ్చింది. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో పై పైకి పరుగులు పెట్టాయి. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య భౌగోళిక రాజకీయ టెన్షన్ ఏర్పడటంతో, ఇన్వెస్టర్లు బులియన్‌ను సురక్షితమైన ఆస్తిగా భావిస్తున్నట్టు విశ్లేషకులు చెప్పారు. దీంతో గత రెండు నెలల కాలంలో బంగారం గరిష్ట స్థాయిలకు ఎగుస్తున్నట్టు పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర 0.7 శాతం పెరిగి, ఒక్కో ఔన్స్‌కు 1,286.07 డాలర్లుగా నమోదైంది. జూన్ 8 తర్వాత అత్యంత గరిష్ట స్థాయి 1,286.40 డాలర్లను తాకింది. డిసెంబర్ నెల అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 1 శాతం పెరిగి ఒక్కో ఔన్స్‌కు 1,291.80 డాలర్లుగా రికార్డు అయ్యాయి.
అమెరికా ప్రొడ్యూసర్ ధరలు ఊహించని రీతిలో జూలై నెలలో పడిపోవడంతో బంగారం ధరలు పెరగడం ప్రారంభమయ్యాయి. మరోవైపు నేడు(శుక్రవారం) విడుదలయ్యే ద్రవ్యోల్బణ డేటా ఎలా ఉండనుందో కూడా ఆసక్తి నెలకొంది. ఈ డేటా బట్టి భవిష్యత్తులో ఫెడ్ తీసుకోబోయే నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఇతర విలువైన మెటల్ సిల్వర్ కూడా 1.7 శాతం పైకి ఎగిసింది. 17.24 డాలర్ల గరిష్ట స్థాయిలను తాకిన తర్వాత ఒక్కో ఔన్స్‌కు 17.20 డాలర్లుగా సిల్వర్ నమోదైంది. జూన్ 14 తర్వాత ఇదే అత్యంత గరిష్ట స్థయి. ప్లాటినం కూడా 1.1 శాతం వృద్ధి చెంది, ఒక్కో ఔన్స్‌కు 982.40 డాలర్లుగా నమోదైంది. భారత్‌లో కూడా శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా 344 రూపాయల మేర పైకి ఎగిశాయి. అనంతరం స్తబ్దుగా 29,177 రూపాయల వద్ద కొనసాగుతున్నాయి.
Advertisement