సాక్షి, ముంబై : అక్షయ తృతీయ సమీపిస్తున్న తరుణంలో గతవారం భయపెట్టిన బంగారం ధరలు దిగి వస్తూ కొనుగోలుదారులను ఊరిస్తున్నాయి. గత రెండుసెషన్లుగా దిగి వచ్చిన పుత్తడి ధర ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో అరశాతం క్షీణించి (రూ.235) రూ.45,500 వద్ద ట్రేడవుతోంది. మునుపటి సెషన్‌లో గోల్డ్ రేట్ 10 గ్రాములు రూ.1600 తగ్గింది. సోమవారం కూడా ధర దిగి వచ్చింది. డెరివేటివ్ మార్కెట్లో గత శుక్రవారం రికార్డ్ స్థాయిలో రూ.47327కు చేరింది. అయితే వెండి ధర మాత్రం స్వల్పంగా పుంజుకుంది. మే ఫ్యూచర్స్‌లో కిలో వెండి ధర 0.3శాతం పెరిగి రూ.42,940 కు చేరింది. ఆల్ టైమ్ గరిష్టం వద్ద ఎంసీఎక్స్‌లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారని బులియన్ వర్తకులు తెలిపారు. (హాలీవుడ్ సంస్థతో బాలీవుడ్ 'ఏరోస్' విలీనం)
గత వారం రికార్డ్ స్థాయి గరిష్టానికి చేరిన బంగారం ధరలు ప్రస్తుతం కాస్త శాంతించింది. ముఖ్యంగా ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 26న జరుపుకోనున్న తరుణంలో గత రెండు రోజుల్లో పసిడి ధర రూ.1800 తగ్గింది. వెండి ధర మాత్రం ఇవాళ స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగిరావడంతో దేశీయ మార్కెట్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోందని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే ఇవాళ బంగారం దర తగ్గడంతో వారం రోజుల కనిష్ట స్థాయికి పడిపోయింది. లాక్‌డౌన్ తర్వాత ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడినపడే అవకాశముందని ఇన్వెస్టర్లు ధీమాతో ఉన్నారు. దీంతో ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర అరశాతం తగ్గి 1675.92 డాలర్లకు చేరింది. గత సెషన్‌లో కూడా గోల్డ్ రేట్ 2శాతం దిగివచ్చింది. వెండి ధర కూడా 0.3శాతం తగ్గి 15.08 డాలర్లకు తగ్గింది. ఇతర విలువైన మెటల్స్ విషయానికి వస్తే ప్లాటినమ్ 0.9 శాతం తగ్గి 768.12 డాలర్లకు చేరింది. (లాక్‌డౌన్.2 : జియో గుడ్ న్యూస్)
మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరంలో 2020-21 సిరీస్ గోల్డ్ బాండ్స్ సబ్‌స్క్రిప్షన్ ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ కింద గోల్డ్ బాండ్ గ్రాము ధరను రూ.4639 గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఇష్యూ ఈనెల 24తో ముగిస్తుంది. ఏప్రిల్ 28న బాండ్లను జారీ చేయనున్నారు. కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ ఉన్నప్పటికీ అక్షయ తృతీయ నాడు బంగారం అమ్మకాలు జరపాలని ప్రముఖ బంగారం దుకాణ సంస్థలు నిర్ణయించాయి. టాటా గ్రూప్ తనిష్క్ జ్యూయలరీ ఏప్రిల్ 18 నుంచి 27 వరకు కస్టమర్లు తమ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ బంగారాన్ని కొనుగోలు చేయొచ్చని తెలిపింది. ఈ మేరకు తమ సిబ్బంది వీడియో కాల్, ఆన్ లైన్ ఛాటింగ్ ద్వారా కొనుగోలు చేయొచ్చని, లాక్ డౌన్ ఎత్తివేత అనంతరం వినియోగదారులు సంబంధిత నగలను పొందవచ్చని ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా అక్షయ తృతీయ తిధిని పురస్కరించుకొని కనీసం గోరెడు బంగారమైనా కొంటే కలిసొస్తుందని భారతీయుల విశ్వాసం. మరోవైపు కరోనా వైరస్ ఉధృతికి ఇంకా అడ్డుకట్ట పడకపోవడంతో లాక్ డౌన్ గడువు మే 3వ తేదీ వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment