న్యూఢిల్లీ : బంగారం ప్రియులకు శుభవార్త. బుధవారం బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒక్కరోజే 430 రూపాయల మేర పడిపోయాయి. స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్ క్షీణించడంతో పాటు, అంతర్జాతీయంగా సంకేతాలు బలహీనంగా వస్తుండటంతో, బుధవారం బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర 430 రూపాయలు తగ్గి రూ.32,020గా నమోదైంది. సిల్వర్ కూడా బంగారం బాటనే పట్టింది. సిల్వర్ ధరలు సైతం కేజీకి 250 రూపాయలు తగ్గి రూ.40,650గా నమోదయ్యాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒక్క ఔన్స్‌కు 1300 డాలర్ల కిందకి పడిపోవడంతో, దేశీయంగా బంగారం ధరలు తగ్గినట్టు తెలిసింది.
అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం, డాలర్ బలపడటంతో బంగారం ధర అంతర్జాతీయంగా ఈ ఏడాది కనిష్ట స్థాయిల్లో ఔన్స్‌కు 1290.30 డాలర్లను నమోదుచేసింది. సిల్వర్ కూడా అంతర్జాతీయంగా 1.52 శాతం తగ్గి, ఔన్స్‌కు 16.24 డాలర్లగా ఉంది. కేవలం అంతర్జాతీయంగా ఈ విలువైన మెటల్స్ ధరలు పడిపోవడమే కాకుండా.. స్థానిక ఆభరణదారులు, వర్తకుల నుంచి ప్రస్తుతం డిమాండ్ తగ్గడంతో దేశీయంగా ధరలు దిగొచ్చాయని బులియన్ ట్రేడర్లు చెప్పారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.430 చొప్పున తగ్గి రూ.32,020, రూ.31,870గా నమోదయ్యాయి. నిన్నటి ట్రేడింగ్‌లో బంగారం ధరలు 165 రూపాయలు లాభపడిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment