హైదరాబాద్: అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగా మెరుగుపడుతోంది కాబట్టి దేశీ ఐటీ రంగానికి వచ్చే ఏడాది మెరుగ్గా ఉండగలదని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. టెక్నాలజీపై వ్యయం పెరగనుందని, కస్టమర్ల నుంచి డిమాండ్ కూడా ఎక్కువవుతుందని భావిస్తున్నట్లు వారు చెప్పారు. భారత ఐటీ రంగం ప్రధానంగా ఆధారపడే అమెరికా మార్కెట్లో అవకాశాలు అందిపుచ్చుకోగలగడమన్నది దేశీ సంస్థలకు కీలకమని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో వి.బాలకృష్ణన్ చెప్పారు.
‘అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా బాగా మెరుగుపడింది. వార్షికంగా సుమారు 2–2.5 శాతం మేర వృద్ధి చెందుతోంది. ఇది అమెరికా వంటి దేశానికి మెరుగైన వృద్ధి రేటే. పైపెచ్చు అక్కడ ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఆ దేశాధ్యక్షుడు ట్రంప్... కార్పొరేట్ పన్నుల్ని తగ్గిస్తామని చెబుతున్నారు. దీంతో ఐటీపై కంపెనీలు చేసే వ్యయాలు కూడా 4–4.5 శాతం మేర పెరగబోతోంది.
కాబట్టి వ్యాపార వృద్ధికి అవకాశాలు బాగున్నాయనే చెప్పొచ్చు. కాకపోతే వాటిని మన ఐటీ కంపెనీలు ఎంత మేర అందిపుచ్చుకోగలవన్నదే కీలకం’’ అని ఆయన వివరించారు. ఇక భారత ఐటీ కంపెనీల సమాఖ్య నాస్కామ్.. 2017–18లో ఐటీ ఎగుమతులు 7–8% మేర పెరగొచ్చని, దేశీ మార్కెట్ 10–11% మేర వృద్ధి చెందవచ్చని వేసిన అంచనాలు సహేతుకంగానే కనిపిస్తున్నాయన్నారు.
అంతర్జాతీయంగా ఐటీపై ఏటా 3.7 లక్షల కోట్ల డాలర్ల వ్యయాలు ఉంటుండగా.. ఇందులో మూడో వంతు ఐటీ సర్వీసులదేనని బాలకృష్ణన్ తెలిపారు. అటు ఇన్ఫోసిస్ మరో మాజీ సీఎఫ్‌వో టీవీ మోహన్‌దాస్ పాయ్ సైతం డిజిటల్ కార్యకలాపాలు వేగవంతమవుతున్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment