మైక్రోసాఫ్ట్ విండోస్ మొండికేయటంతో శుక్రవారం ఒక్కసారిగా అంతా అస్తవ్యస్తమైన తీరు ఐటీపై ప్రపంచం ఎంతగా ఆధారపడిందో కళ్లకు కట్టింది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాలతోపాటు మన దేశంలోనూ అనేక సేవలకు అంతరాయం ఏర్పడింది. మ్యాక్, లైనెక్స్ ఆధారిత సేవలు యథావిధిగా పనిచేశాయి. 1872లో ఆంగ్ల రచయిత శామ్యూల్ బట్లర్ యంత్రాలకు సొంతంగా ఆలోచించే, తిరిగి తమంత తాము చేయగలిగే సామర్థ్యం వస్తే ఎలావుంటుందో చూపుతూ ఎరెవాన్ అనే వ్యంగ్య నవల రాశాడు. అది మరీ అతిగావుందని సమకాలికుల నుంచి విమర్శలొచ్చాయి. బహుశా ప్రపంచంలో అదే తొలి సైన్స్ ఫిక్షన్. ఆ కోవలో తర్వాత చాలా వచ్చాయి.
సైబర్ దాడులు జరిగితే ప్రపంచం ఏమవుతుందన్న ఇతివృత్తాలతో చలనచిత్రాలు, టీవీ సీరియళ్లు వచ్చాయి. కానీ మైక్రోసాఫ్ట్ విండో స్‌కు సైబర్ నేరగాళ్లనుంచి కాకుండా అలాంటివారినుంచి రక్షిస్తామని చెప్పే ఒక సైబర్ సెక్యూరిటీ సంస్థ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌వల్ల సమస్యలు తలెత్తి ఇంత పని జరగటం ఒక వైచిత్రి. మైక్రోసాఫ్ట్‌కు సైబర్ సెక్యూరిటీ సేవలందించే క్రౌడ్‌స్ట్రయిక్ అనే అమెరికా సంస్థ తాను రూపొందించిన యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను నవీకరించి కొత్తది విడుదల చేయగానే సమస్య తలెత్తిందంటున్నారు. దీంతో మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఇన్‌ట్యూన్, వన్‌నోట్, షేర్‌పాయింట్, మైక్రోసాఫ్ట్ డిఫెండర్ వంటి అనేక యాప్‌లు నిరర్థకమయ్యాయి.
ఒక్కొక్కటే మళ్లీ పునరుద్ధరిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. అయితే ఈలోగా అనేక దేశాల్లో కంప్యూటర్లు ఆగిపోయాయి. రైళ్లు, విమానయాన సేవలు నిలిచి పోవటం మొదలుకొని దుకాణాల్లో చెల్లింపుల ప్రక్రియ వరకూ అన్నిటికన్నీ స్తంభించిపోయాయి. చాలాచోట్ల వాణిజ్య, వ్యాపార లావాదేవీలూ, బ్యాంకింగ్, ఆరోగ్య సేవలూ, వార్తా ప్రసారాలూ, పోలీసు వ్యవస్థలూ, మెట్రో సర్వీసులూ, స్టాక్ ఎక్స్ఛేంజ్‌లూ నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది సంస్థల్లో వినియోగించే టీమ్స్ సాఫ్ట్‌వేర్ సైతం ఆగిపోయింది. విమానాల్లో బోర్డింగ్ పాస్‌లు చేతితో రాసి ఇవ్వటం అందరూ మరిచి దాదాపు మూడు దశాబ్దాలవుతోంది. తాజా సమస్య అదెలా వుంటుందో ఈ తరానికి రుచి చూపింది.
సమాచార సాంకేతికతలు వర్తమాన యుగంలో జీవితాన్ని వేగవంతం చేశాయి. కొన్ని శతాబ్దాలు ఇలాంటివేమీ లేకుండానే ప్రపంచం మనుగడ సాగించిందన్న సంగతినే మరిచేలా చేశాయి. అర చేతిలో ప్రపంచం మొత్తం ఇమిడిపోయింది. ఖండాంతరాల్లోని మారుమూల దేశాల్లోనివారితో సైతం ఎక్కడున్నవారైనా మాట్లాడగలిగే వెసులుబాటు అందుబాటులోకొచ్చింది. మనుష్య సంచారం అసాధ్యమనుకున్న చోటకు సైతం డ్రోన్‌లు వెళ్తున్నాయి. సాధారణ పనులు మొదలుకొని ప్రమాదం పొంచివుండే కార్యాలవరకూ రోబోలు చేస్తున్నాయి. సంక్లిష్ట సమస్యలకు చిటికెలో పరిష్కారం లభిస్తోంది. అందువల్ల ఉత్పాదకత పెరిగింది.
చాలా తక్కువ వ్యవధిలో ఎక్కువ పని చేయగలిగే సామర్థ్యం మనుషుల సొంతమైంది. కావలసిన సమాచారం కోసం గూగుల్‌ని ఆశ్రయించేవారే నిమి షానికి 63 లక్షలమంది ఉన్నారంటే పరిస్థితేమిటో అర్థమవుతుంది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా సగటు ఆయుఃప్రమాణం 52.5 సంవత్సరాలైతే ఆరోగ్యరంగ సాంకేతికతలవల్ల అది ప్రస్తుతం 72 సంవత్సరాలని ఐక్యరాజ్యసమితి నిరుడు ప్రకటించింది. సమాచార సాంకేతికతలు అనేకచోట్ల మనిషి అవసరాన్ని తగ్గించాయి. అందువల్ల కొందరి ఉద్యోగావకాశాలకు ముప్పు వచ్చిన మాట కూడా వాస్తవం. కానీ ఇదివరకెన్నడూ వినని అనేక రకాల కొత్త అవకాశాలు లభించాయి.
వచ్చే ఏడాదికల్లా ప్రపంచవ్యాప్తంగా ఈ సాంకేతికతల్లో 9 కోట్ల 70 లక్షల ఉద్యోగావకాశాలుంటాయని ఒక అంచనా. అయితే ఈ సాంకేతికతల వల్ల సాంఘిక జీవనం అస్తవ్యస్తమవుతున్నదని, మనిషి ఏకాకి అవుతున్నాడని, పర్యవసానంగా సమాజంలో అమానవీయత విస్తరించిందని, వ్యక్తి గోప్యతకు ముప్పు ఏర్పడిందని, పౌరుల జీవితాల్లోకి రాజ్యం చొరబాటు ఊహకందనంత పెరిగిందని కనబడు తూనేవుంది. తప్పుడు సమాచారం వ్యాప్తిచేసి లాభపడే శక్తులున్నట్టే, దానివల్ల నష్టపోతున్నవారూ అధికంగానే ఉన్నారు.
ఈ సాంకేతికతల అభివృద్ధి పరుగులో పర్యావరణానికి కలుగుతున్న హాని గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు. పారిశ్రామికీకరణ తర్వాత భవిష్యత్తు స్పృహ కొరవడి అడవుల, ఇతరేతర సహజ సంపదల విధ్వంసం, పర్యవసానంగా ప్రకృతి వైపరీత్యాలు క్రమేపీ పెరిగాయనుకుంటే ఐటీ అభివృద్ధి దీన్ని మరింత వేగవంతం చేసింది. పర్యావరణ అనుకూల సుస్థిరాభివృద్ధి వైపు దృష్టి సారించాలన్న వినతులు అరణ్యరోదనే అవుతున్నాయి.
పాతికేళ్ల క్రితం వై2కె సమస్యతో ప్రపంచం తలకిందులవుతుందన్న ప్రచారం జరిగింది. ఈ సమస్య పరిష్కారానికి వేల కోట్లు ఖర్చుచేయటం తప్పనిసరన్న అంచనాలు వచ్చాయి. తీరా చాలా సులభంగానే దానికి పరిష్కారం దొరికింది. నిజానికి ఆ రోజుల్లో కంప్యూటర్ల వాడకం, వాటిపై ఆధారపడటం ఇప్పటితో పోలిస్తే తక్కువనే చెప్పాలి. కానీ తరచు సైబర్ దాడులతో తల్లడిల్లే సమా చార సాంకేతిక ప్రపంచంలో తాజా ఉదంతం ఒక పెద్ద కుదుపు.
అప్రమత్తంగా లేకపోతే, విడుదల చేసేముందు ఒకటికి పదిసార్లు పరీక్షించి చూసుకోనట్టయితే ఒక సాఫ్ట్‌వేర్ ఎంతటి ఉత్పాతం సృష్టించగలదో తాజా ఉదంతం ఒక హెచ్చరిక. ఇంతవరకైతే ఫర్యాలేదు. కానీ దాదాపు అన్ని దేశాల రక్షణ వ్యవస్థలూ ఐటీతో ముడిపడివున్న వర్తమానంలో పొరపాటున సాఫ్ట్‌వేర్ లోపంతో కంప్యూటర్లు తప్పుగా అర్థం చేసుకుంటే పెనుముప్పు ఏర్పడుతుంది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే మారణా యుధాలు భూగోళాన్ని వల్లకాడు చేస్తాయి. ఆ విషయంలో అప్రమత్తత అవసరం.
Comments
Please login to add a commentAdd a comment