Microsoft Windows
-
క్రౌడ్‌స్ట్రైక్ అతలాకుతలం
వాషింగ్టన్: ప్రపంచమంతటినీ అతలాకుతలం చేసిన విండోస్ ఆపరేటింగ్ సిస్టం సాంకేతిక సమస్య ఆర్థికంగా కూడా అంతర్జాతీయంగా గట్టి ప్రభావమే చూపింది. పలు దిగ్గజ సంస్థల షేర్ల విలువ తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా తప్పుడు అప్డేట్తో సమస్యకు కారణమైన సైబర్ సెక్యూరిటీ దిగ్గజం క్రౌడ్‌స్ట్రైక్‌కు ఆర్థికంగా గట్టి దెబ్బే తగిలింది. శుక్రవారం ఆ సంస్థ షేర్ వాల్యూ ఒక్కసారిగా 11 శాతానికి పైగా పడిపోయింది. 42.22 డాలర్లున్న ఒక్కో వాటా విలువ 30 డాలర్లకు తగ్గింది. సంస్థ మొత్తం విలువ 83 బిలియన్ డాలర్ల పై చిలుకని అంచనా. ఆ లెక్కన 900 కోట్ల డాలర్లకు పైగా హరించుకుపోయినట్టే. అయితే ఆర్థిక నష్టం కంటే కూడా ప్రపంచంలోనే అగ్రశ్రేణి సైబర్ సెక్యూరిటీ సంస్థగా క్రౌడ్‌స్ట్రైక్‌కు ఉన్న ఇమేజీకి జరిగిన నష్టమే చాలా ఎక్కువ. ఎందుకంటే దాని కస్టమర్లుగా ఉన్న కంపెనీలు, పెద్ద సంస్థల్లో చాలావరకు తమ సైబర్ సెక్యూరిటీ బాధ్యతల కోసం ఇతర సైబర్ సెక్యూరిటీ సంస్థలవైపు చూస్తున్నట్టు సమాచారం. ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి దిగ్గజ కంపెనీల సీఈఓ ఎలాన్ మస్క్ ఇప్పటికే ఈ జాబితాలో చేరారు. ‘‘మా వ్యవస్థల నుంచి క్రౌడ్స్ట్రౌక్ను తొలగించేశాం’’ అంటూ ఆయన సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేశారు. సెంటినల్ వన్, పాలో ఆల్టో నెట్వర్క్ వంటి క్రౌడ్ర్స్టౌక్ ప్రత్యర్థి కంపెనీలు ఈ పరిస్థితిని రెండు చేతులా సొమ్ము చేసుకుంటున్నాయి. భారీ పరిహారాలు! మరోవైపు క్రౌడ్‌స్ట్రైక్ కస్టమర్లంతా తమకు జరిగిన నష్టానికి ఆ సంస్థ నుంచి భారీగా నష్టపరిహారం డిమాండ్ చేసేలా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు ఆ సంస్థ క్లయింట్ల జాబితాలో ఉండటం తెలిసిందే. షట్‌డౌన్ దెబ్బకు వాటి షేర్ల విలువ సగటున ఒక శాతం దాకా పడిపోయినట్టు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. -
స్తంభించిన ప్రపంచం!
మైక్రోసాఫ్ట్ విండోస్ మొండికేయటంతో శుక్రవారం ఒక్కసారిగా అంతా అస్తవ్యస్తమైన తీరు ఐటీపై ప్రపంచం ఎంతగా ఆధారపడిందో కళ్లకు కట్టింది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాలతోపాటు మన దేశంలోనూ అనేక సేవలకు అంతరాయం ఏర్పడింది. మ్యాక్, లైనెక్స్ ఆధారిత సేవలు యథావిధిగా పనిచేశాయి. 1872లో ఆంగ్ల రచయిత శామ్యూల్ బట్లర్ యంత్రాలకు సొంతంగా ఆలోచించే, తిరిగి తమంత తాము చేయగలిగే సామర్థ్యం వస్తే ఎలావుంటుందో చూపుతూ ఎరెవాన్ అనే వ్యంగ్య నవల రాశాడు. అది మరీ అతిగావుందని సమకాలికుల నుంచి విమర్శలొచ్చాయి. బహుశా ప్రపంచంలో అదే తొలి సైన్స్ ఫిక్షన్. ఆ కోవలో తర్వాత చాలా వచ్చాయి. సైబర్ దాడులు జరిగితే ప్రపంచం ఏమవుతుందన్న ఇతివృత్తాలతో చలనచిత్రాలు, టీవీ సీరియళ్లు వచ్చాయి. కానీ మైక్రోసాఫ్ట్ విండో స్కు సైబర్ నేరగాళ్లనుంచి కాకుండా అలాంటివారినుంచి రక్షిస్తామని చెప్పే ఒక సైబర్ సెక్యూరిటీ సంస్థ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌వల్ల సమస్యలు తలెత్తి ఇంత పని జరగటం ఒక వైచిత్రి. మైక్రోసాఫ్ట్‌కు సైబర్ సెక్యూరిటీ సేవలందించే క్రౌడ్‌స్ట్రయిక్ అనే అమెరికా సంస్థ తాను రూపొందించిన యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను నవీకరించి కొత్తది విడుదల చేయగానే సమస్య తలెత్తిందంటున్నారు. దీంతో మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఇన్‌ట్యూన్, వన్‌నోట్, షేర్‌పాయింట్, మైక్రోసాఫ్ట్ డిఫెండర్ వంటి అనేక యాప్‌లు నిరర్థకమయ్యాయి. ఒక్కొక్కటే మళ్లీ పునరుద్ధరిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. అయితే ఈలోగా అనేక దేశాల్లో కంప్యూటర్లు ఆగిపోయాయి. రైళ్లు, విమానయాన సేవలు నిలిచి పోవటం మొదలుకొని దుకాణాల్లో చెల్లింపుల ప్రక్రియ వరకూ అన్నిటికన్నీ స్తంభించిపోయాయి. చాలాచోట్ల వాణిజ్య, వ్యాపార లావాదేవీలూ, బ్యాంకింగ్, ఆరోగ్య సేవలూ, వార్తా ప్రసారాలూ, పోలీసు వ్యవస్థలూ, మెట్రో సర్వీసులూ, స్టాక్ ఎక్స్ఛేంజ్లూ నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది సంస్థల్లో వినియోగించే టీమ్స్ సాఫ్ట్వేర్ సైతం ఆగిపోయింది. విమానాల్లో బోర్డింగ్ పాస్‌లు చేతితో రాసి ఇవ్వటం అందరూ మరిచి దాదాపు మూడు దశాబ్దాలవుతోంది. తాజా సమస్య అదెలా వుంటుందో ఈ తరానికి రుచి చూపింది.సమాచార సాంకేతికతలు వర్తమాన యుగంలో జీవితాన్ని వేగవంతం చేశాయి. కొన్ని శతాబ్దాలు ఇలాంటివేమీ లేకుండానే ప్రపంచం మనుగడ సాగించిందన్న సంగతినే మరిచేలా చేశాయి. అర చేతిలో ప్రపంచం మొత్తం ఇమిడిపోయింది. ఖండాంతరాల్లోని మారుమూల దేశాల్లోనివారితో సైతం ఎక్కడున్నవారైనా మాట్లాడగలిగే వెసులుబాటు అందుబాటులోకొచ్చింది. మనుష్య సంచారం అసాధ్యమనుకున్న చోటకు సైతం డ్రోన్లు వెళ్తున్నాయి. సాధారణ పనులు మొదలుకొని ప్రమాదం పొంచివుండే కార్యాలవరకూ రోబోలు చేస్తున్నాయి. సంక్లిష్ట సమస్యలకు చిటికెలో పరిష్కారం లభిస్తోంది. అందువల్ల ఉత్పాదకత పెరిగింది. చాలా తక్కువ వ్యవధిలో ఎక్కువ పని చేయగలిగే సామర్థ్యం మనుషుల సొంతమైంది. కావలసిన సమాచారం కోసం గూగుల్‌ని ఆశ్రయించేవారే నిమి షానికి 63 లక్షలమంది ఉన్నారంటే పరిస్థితేమిటో అర్థమవుతుంది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా సగటు ఆయుఃప్రమాణం 52.5 సంవత్సరాలైతే ఆరోగ్యరంగ సాంకేతికతలవల్ల అది ప్రస్తుతం 72 సంవత్సరాలని ఐక్యరాజ్యసమితి నిరుడు ప్రకటించింది. సమాచార సాంకేతికతలు అనేకచోట్ల మనిషి అవసరాన్ని తగ్గించాయి. అందువల్ల కొందరి ఉద్యోగావకాశాలకు ముప్పు వచ్చిన మాట కూడా వాస్తవం. కానీ ఇదివరకెన్నడూ వినని అనేక రకాల కొత్త అవకాశాలు లభించాయి. వచ్చే ఏడాదికల్లా ప్రపంచవ్యాప్తంగా ఈ సాంకేతికతల్లో 9 కోట్ల 70 లక్షల ఉద్యోగావకాశాలుంటాయని ఒక అంచనా. అయితే ఈ సాంకేతికతల వల్ల సాంఘిక జీవనం అస్తవ్యస్తమవుతున్నదని, మనిషి ఏకాకి అవుతున్నాడని, పర్యవసానంగా సమాజంలో అమానవీయత విస్తరించిందని, వ్యక్తి గోప్యతకు ముప్పు ఏర్పడిందని, పౌరుల జీవితాల్లోకి రాజ్యం చొరబాటు ఊహకందనంత పెరిగిందని కనబడు తూనేవుంది. తప్పుడు సమాచారం వ్యాప్తిచేసి లాభపడే శక్తులున్నట్టే, దానివల్ల నష్టపోతున్నవారూ అధికంగానే ఉన్నారు. ఈ సాంకేతికతల అభివృద్ధి పరుగులో పర్యావరణానికి కలుగుతున్న హాని గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు. పారిశ్రామికీకరణ తర్వాత భవిష్యత్తు స్పృహ కొరవడి అడవుల, ఇతరేతర సహజ సంపదల విధ్వంసం, పర్యవసానంగా ప్రకృతి వైపరీత్యాలు క్రమేపీ పెరిగాయనుకుంటే ఐటీ అభివృద్ధి దీన్ని మరింత వేగవంతం చేసింది. పర్యావరణ అనుకూల సుస్థిరాభివృద్ధి వైపు దృష్టి సారించాలన్న వినతులు అరణ్యరోదనే అవుతున్నాయి. పాతికేళ్ల క్రితం వై2కె సమస్యతో ప్రపంచం తలకిందులవుతుందన్న ప్రచారం జరిగింది. ఈ సమస్య పరిష్కారానికి వేల కోట్లు ఖర్చుచేయటం తప్పనిసరన్న అంచనాలు వచ్చాయి. తీరా చాలా సులభంగానే దానికి పరిష్కారం దొరికింది. నిజానికి ఆ రోజుల్లో కంప్యూటర్ల వాడకం, వాటిపై ఆధారపడటం ఇప్పటితో పోలిస్తే తక్కువనే చెప్పాలి. కానీ తరచు సైబర్ దాడులతో తల్లడిల్లే సమా చార సాంకేతిక ప్రపంచంలో తాజా ఉదంతం ఒక పెద్ద కుదుపు. అప్రమత్తంగా లేకపోతే, విడుదల చేసేముందు ఒకటికి పదిసార్లు పరీక్షించి చూసుకోనట్టయితే ఒక సాఫ్ట్వేర్ ఎంతటి ఉత్పాతం సృష్టించగలదో తాజా ఉదంతం ఒక హెచ్చరిక. ఇంతవరకైతే ఫర్యాలేదు. కానీ దాదాపు అన్ని దేశాల రక్షణ వ్యవస్థలూ ఐటీతో ముడిపడివున్న వర్తమానంలో పొరపాటున సాఫ్ట్వేర్ లోపంతో కంప్యూటర్లు తప్పుగా అర్థం చేసుకుంటే పెనుముప్పు ఏర్పడుతుంది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే మారణా యుధాలు భూగోళాన్ని వల్లకాడు చేస్తాయి. ఆ విషయంలో అప్రమత్తత అవసరం. -
విండోస్ 11పై మరో అప్ డేట్, క్రాక్ వెర్షన్లో ట్రై చేస్తున్నారా?
విండోస్ 11పై మరో అప్ డేట్‌తో మైక్రోస్టాఫ్ట్ ముందుకు వచ్చింది. థర్డ్ పార్టీ టూల్స్ ద్వారా ఇన్ స్టాల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న యూజర్లను హెచ్చరించింది. ఎవరైతే చీట్ చేసి విండోస్‌ను అప్ డేట్ చేస్తారో వారి సిస్టమ్ లలో విండోస్ పనిచేయదని, బ్లాక్ చేస్తామని తెలిపింది. మైక్రోసాఫ్ట్ జులై 25, 2015లో విండోస్ 10ను అప్డేట్ చేసింది. దాదాపూ 6ఏళ్ల తరువాత విండోస్11 ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఈ ఏడాది జూన్ నెలలో అధికారికంగా ప్రకటించింది. విండోస్ 11ను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో డేట్ చెప్పకపోయినప్పటికి టెక్ నిపుణులు మాత్రం ఈ ఏడాది చివరిలో వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ విండోస్ -11 ఇన్స్టాల్ చేసుకోవాలంటే కావాల్సిన రిక్వైర్ మెంట్‌ను అనౌన్స్ చేసింది.1జీహెచ్‌జెడ్ ప్రాసెసర్ ,64బిట్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, ట్రస్టెడ్ ఫ్లాట్‌ఫామ్ మోడల్ వెర్షన్ (టీపీఎం) 2.0, పనితీరు బాగుండేందుకు డైరెక్ట్ ఎక్స్12, డబ్ల్యూడీడీఎం 2.0 డ్రవైర్ కావాలని చెప్పింది. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీనియర్ ప్రోగ్రాం మేనేజర్ అరియా కార్లే మాట్లాడుతూ.. విండోస్ 11 ఇన్స్టాల్ అవ్వాలంటే ఈ ఫీచర్స్ ఉండాలని, లేదంటే విండోస్ 11ఇన్స్టాల్ అవ్వదని చెప్పారు. థర్ట్ పార్టీ ద్వారా ఇన్ స్టాల్ పనితీరు ఆగిపోతుందని స్పష్టం చేశారు. -
సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. విండోస్ సాయంతో
ప్రపంచ దేశాలకు చెందిన రహస్యాల్ని దొంగిలించేందుకు రోజుకో స్పై వైరస్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ తమ ఆపరేటింగ్ సిస్టమ్స్ సాయంతో రెండు స్పై వైరస్లు (డెవిల్స్ టంగ్ అని పిలిచే ) దాడి చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. 10 దేశాలకు చెందిన 100 మంది యాక్టివిస్ట్‌లు, జర్నలిస్ట్‌లు, ప్రభుత్వంపై అసమ్మతివాదులపై సైతం ఈ స్పైవేర్ దాడి జరిగిందని సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ యూనివర్సిటీ ఆఫ్ టోరంటో సిటిజన్ ల్యాబ్ తెలిపింది. ఇజ్రాయిల్ కు చెందిన 'కాండిరు' అనే సంస్థ తయారు చేసిన ఈ స్పైవేర్ టార్గెట్‌ను రీచ్ అయ్యేందుకు సౌదీ అరేబియా, ఇజ్రాయిల్, హంగేరీ, ఇండోనేషియాతో పాటు ఇతర దేశాల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్ విండోస్ల సాయంతో ఇన్ స్టాల్ చేశారని, ఇన్ స్టాల్ చేసిన అనంతరం దాడులకు సిద్ధపడినట్లు మైక్రోసాఫ్ట్ డిజిటల్ సెక్యూరిటీ యూనిట విభాగానికి చెందిన జనరల్ మేనేజర్ క్రిస్టిన్ గుడ్విన్ తెలిపారు. సిటిజెన్ ల్యాబ్ పరిశోధకులు స్పైవేర్ దాడుల గురించి చెప్పడంతో మైక్రోసాఫ్ట్ అప్రమత్తమైంది. ఈ దాడుల గురించి 'కాండిరు' పేరు ప్రస్తావించకుండా ఇజ్రాయిల్ కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ స్పై వైరస్‌తో దాడిచేసిందని ప్రస్తావించింది. సిటిజెన్ ల్యాబ్ ప్రకారం..ప్రపంచ దేశాల్ని టెక్నాలజీ పరంగా భయబ్రాంతులకు గురిచేసేందుకు కాండిరు ఈ స్పైవేర్లు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. 16 మిలియన్ యూరోల ($ 18.9 మిలియన్లు) కు కాండిరు తన క్లయింట్లకు ఒకే సారి 10టార్గెట్లను ట్రాక్ చేసేందుకు ఇచ్చినట్లు, అదనంగా 1.5 మిలియన్ యూరో (8 1.8 మిలియన్) చెల్లిస్తే మరో 15 టార్గెట్లను ట్రాక్ చేసేందుకు వీలుపడుతున్నట్లు తేలింది. ఇక కాండిరుకు యూరప్, రష్యా, మిడిల్ ఈస్ట్, ఆసియా, లాటిన్ అమెరికాలో క్లయింట్లు ఉన్నారని ఇజ్రాయెల్ వార్తాపత్రిక హారెట్జ్ తెలిపింది. ఇజ్రాయిల్‌కు చెందిన స్థానిక మీడియా సంస్థలు కాండియా ఉజ్బెకిస్తాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఖతార్ దేశాలతో ఒప్పందాలు కుదర్చుకున్నట్లు వెల్లడించింది. కాండిరు తన క్లయింట్లకు 'అంగీకరించిన భూభాగాలలో' మాత్రమే పనిచేయడానికి పరిమితం చేసుకుంది. అయితే యు.ఎస్, రష్యా, చైనా, ఇజ్రాయెల్, ఇరాన్ వెలుపల కార్యకలాపాలను పరిమితం చేసే ఒప్పందాలపై సంతకం చేసినట్లు, మైక్రోసాఫ్ట్ ఇటీవలే ఇరాన్ స్పైవేర్ తన కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. -
మైక్రోసాఫ్ట్ విండోస్ 10 లూమియా ఫోన్లు
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ తాజాగా లూమియా సిరీస్‌లోనే విండోస్ 10 ఓఎస్ ప్లాట్‌ఫామ్‌పై పనిచేసే ‘లూమియా 950’, ‘లూమియా 950 ఎక్స్ఎల్’ అనే రెండు కొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లో ఆవిష్కరించింది. వీటి ధరలు వరుసగా రూ.43,699గా, రూ.49,399గా ఉన్నాయి. ‘లూమియా 950’ హ్యాండ్‌సెట్‌లో 5.2 అంగుళాల తెర, 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక 5.7 అంగుళాల తెర, 3,340 ఎంఏహెచ్ బ్యాటరీ, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ‘లూమియా 950 ఎక్స్ఎల్’ విండోస్ ఫోన్ సొంతం. కంపెనీ రెండు విండోస్ ఫోన్లలోనూ 20 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా లను పొందుపరిచింది. ఈ కొత్త విండోస్ 10 స్మార్ట్ఫోన్ల ప్రి-బుకింగ్ ఇప్పటికే ప్రారంభమయ్యిందని, క్రోమా రిటైల్ చైన్స్‌లో, మైక్రోసాఫ్ట్ ప్రియారిటీ రీసెల్లర్స్ వద్ద, అమెజాన్.ఇన్‌లోని మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో, రిలయన్స్, సంగీత రిటైల్ స్టోర్లలో కొత్త లూమియా హ్యాండ్సెట్లను ప్రి-బుకింగ్ చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ ఇండియా జీఎం అజయ్ మెహతా తెలిపారు.