
దేశీ ఎకానమీలో కొన్ని సవాళ్లున్నప్పటికీ... రిటైల్, బ్యాంకులు, కన్జూమర్ డ్యూరబుల్స్ మొదలైన రంగాలకు చెందిన సంస్థల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలుంటాయని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ సీఈవో ఎ.బాలసుబ్రమణియన్ చెప్పారు. ఈ సారి రుతుపవనాలు కాస్త మెరుగ్గా ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో గ్రామీణ, వ్యవసాయ ఆధారిత సంస్థలూ సానుకూలంగానే కనిపిస్తున్నాయని తెలియజేశారాయన. మార్కెట్ల రాబడులు, సిప్‌లు తదితర అంశాలపై ఆయన ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. – హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
రుతుపవనాలపై సానుకూల అంచనాలు..
అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు, వాణిజ్య యుద్ధ భయాలు మొదలైన వాటితో అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లలో కొన్ని నెలలుగా అనిశ్చితి నెలకొంది. ఇక చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తదితర అంశాలతో దేశీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులపై కూడా ప్రతికూల ప్రభావం పడింది.
అయితే, మెరుగైన వర్షపాతంతో వ్యవసాయోత్పత్తి ఆశావహంగా ఉండగలదన్న అంచనాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకుంటుండటంతో ఆటోమొబైల్స్, కన్జూమర్ డ్యూరబుల్స్ అమ్మకాలు మెరుగుపడుతున్నాయి. ఈ రంగాల సంస్థల షేర్లతో పాటు రిటైల్ కార్యకలాపాలపై ప్రధానంగా దృష్టి పెట్టే బ్యాంకులు, గ్రామీణ.. వ్యవసాయ రంగాలకు సంబంధించిన సంస్థల షేర్లు మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నాం.
దీర్ఘకాలంలో ఈక్విటీలతో అధిక రాబడి..
ప్రతి రెండు మూడేళ్లకోసారి మార్కెట్లు కొంత అనిశ్చితం పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉంటా యి. అయినప్పటికీ.. దీర్ఘకాలంలో చూస్తే జీడీపీ వృద్ధికి మించి 3–4 శాతం అధికంగానే రాబడులిస్తుంటాయి. పెట్టుబడులకు కట్టుబడి ఓపికగా వేచి చూడగలిగితే ప్రయోజనాలు అందుకోవచ్చు.
గడిచిన 20 ఏళ్లుగా చూస్తే.. పదేళ్ల వ్యవధిలో ఈక్విటీలు 20 శాతానికి పైగా రాబడులిచ్చాయి. అంటే హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ.. సగం కాలం అత్యధిక రాబడులు ఇచ్చినట్లే లెక్క. ఈ 20 ఏళ్లలో కేవలం ఆరు సార్లే మార్కెట్లు ప్రతికూల ఫలితాలు కనపర్చాయి. మొత్తం మీద అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఈ వ్యవధిలో పెట్టుబడులపై సగటున 17.3 శాతం రాబడి ఉండొచ్చు.
సిప్‌ల నిష్పత్తి ఇలా ..
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ పథకాల (సిప్) ద్వారా ప్రతి నెలా రూ.6,500 కోట్ల మేర పెట్టుబడులు వస్తున్నాయి. ఏటా ఇది పెరుగుతోంది. మార్కెట్లలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. సిప్‌లను కొనసాగించడంతో పాటు వీలైతే ఇన్వెస్ట్‌మెంట్ పరిమాణం పెంచడం, బహుళ సిప్‌ల విధానాన్ని అనుసరిస్తే మరింత అధిక రాబడులు పొందవచ్చు.
అయిదేళ్ల పైబడిన కాలవ్యవధి గల సిప్‌లలో పెట్టుబడులకు సంబంధించి లార్జ్, మల్టీ, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో 30:30:40 నిష్పత్తిలో కేటాయించడం ద్వారా కాంపౌండింగ్ ప్రయోజనాలు కూడా మెరుగ్గా ఉంటాయి. ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేయదల్చుకుంటే.. డబ్బంతా ఒకే సాధనంలో పెట్టకుండా ఈక్విటీతో పాటు ఫిక్సిడ్ ఇన్‌కం స్కీమ్స్‌లోనూ పెట్టడం ద్వారా సమతుల్యత ఉండేలా చూసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment