గూగుల్ కు భారీ షాక్ తప్పదా?
లండన్: ప్రపంచ సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ కు త్వరలోనే భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం సంస్థకు కోర్టు త్వరలోనే వేల కోట్ల రూపాయల జరిమానా విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెర్చ్ ఇంజన్లో తనకు నచ్చిన కంపెనీలకే ముందు స్థానం ఇస్తూ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందంటూ దాఖలైన కేసులో గూగుల్ కు ఎదురు దెబ్బ తగలనుంది. 2010లో వేసిన ఓ కేసులో గూగుల్ కు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని రాయిటర్స్ తెలిపింది. సుమారు 23 వేల కోట్ల (మూడు బిలియన్ యూరోల) భారీ జరిమానా పడనుందని పేర్కొంది.
గత ఆరేళ్లుగా గూగుల్ యూరోపియన్ యూనియన్(ఈయూ) తో పోటీ పడి పలుదఫాలు విఫలం చెందిందనీ, ఇక ఈయూ పక్కకు తప్పుకుంటే తప్ప గూగుల్ జరిమాన నుంచి తప్పించుకోలేదని రాయిటర్స్ పేర్కొంది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న జరిమానా నిర్ణయం జూన్ మొదటి వారంలో అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారుల చెబుతున్నారు. అంతేకాకుండా తనకు నచ్చిన కంపనీ సెర్చ్ రిజల్ట్స్ ఇచ్చే హక్కును కూడా గూగుల్ కోల్పోయే అవకాశం కూడా ఉందని అభిప్రాయపడుతున్నారు. సెర్చ్ లో మొదటి స్థానం సంపాదించిన కంపెనీలకూ 10 శాతం మేర జరిమాన విధించే అవకాశం ఉంది.