‘ట్రాన్స్‌లేట్’ టూల్‌ను అప్‌గ్రేడ్ చేసిన గూగుల్
న్యూఢిల్లీ: స్థానిక భాష మాట్లాడే వారిని ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి గూగుల్ చాలానే శ్రమిస్తోంది. ఇందులో భాగంగానే ఇది తాజాగా ‘గూగుల్ ట్రాన్స్‌లేట్’ టూల్‌ను ‘న్యూరల్ మెషీన్ ట్రాన్స్‌లేషన్’ టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేసింది. ఈ టెక్నాలజీ సాయంతో గూగుల్ ట్రాన్స్‌లేట్ ఇంగ్లిష్ వాక్యాలను బెంగాలీ, మరాఠీ, తమిళ్, తెలుగు, గుజరాతీ, పంజాబీ, మలయాళం, కన్నడ భాషలోకి అనువాదం చేస్తుంది. క్రోమ్ బ్రౌజర్‌లో ఇది ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. అంటే యూజర్లు వెబ్ కంటెంట్‌ను తొమ్మిది భాషల్లో పొందొచ్చు. ‘న్యూరల్ మెషీన్ ట్రాన్స్‌లేషన్’ టెక్నాలజీ సేవలను గూగుల్ సెర్చ్, మ్యాప్స్‌కు కూడా విస్తరించినట్లు కంపెనీ తెలిపింది.
దీంతో రివ్యూలను మనకు అనువైన భాషలో చూడొచ్చు. ఇక జీ–బోర్డు కీబోర్డు యాప్ 22 దేశీ భాషలను సపోర్ట్ చేస్తుందని పేర్కొంది. అలాగే కంపెనీ గూగుల్ సెర్చ్‌కు హిందీ డిక్షనరీని కలిపింది. ‘భారత్‌లో 23.4 కోట్ల మంది ఆన్‌లైన్ యూజర్లు దేశీ భాషలను ఉపయోగిస్తున్నారు. ఇంగ్లిష్ వెబ్ యూజర్ల సంఖ్య 17.5 కోట్లుగా ఉంది.
వచ్చే నాలుగేళ్లలో మరో 30 కోట్ల మంది దేశీ భాషలను విరివిగా వాడే వారు ఆన్‌లైన్‌లోకి రావొచ్చు’ అని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ (ఇండియా, దక్షిణ–తూర్పు ఆసియా) రాజన్ ఆనందన్ తెలిపారు. కాగా గూగుల్ కేపీఎంజీతో కలిసి ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. 2021 నాటికి స్థానిక భాష మాట్లాడే ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 18 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధితో 53.6 కోట్లకు చేరుతుంది.