బంగారు ఆభరణాల ఎగుమతులపై నిషేధం
న్యూఢిల్లీ : 22 క్యారెట్ ప్యూరిటీ కలిగిన బంగారు ఆభరణాలు, మెడలియన్స్, ఇతర ఆభరణాల ఎగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది. బుధవారం జారీచేసిన నోటిఫికేషన్‌లో ప్రభుత్వం ఈ విషయాన్ని తెలిపింది. విదేశీ వాణిజ్య పాలసీ(2015-20) సవరణ ప్రకారం 8 క్యారెట్ నుంచి గరిష్టంగా 22 క్యారెట్ వరకు బంగారం కలిగి ఉన్న బంగారు ఆభరణాలు, ఇతర ఆర్టికల్స్‌ను మాత్రమే దేశీయ టారిఫ్ ఏరియా, ఎక్స్‌పోర్టు ఓరియెంటెడ్ యూనిట్లు, ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ టెక్నాలజీ పార్కులు, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కులు, బయో టెక్నాలజీ పార్కుల నుంచి ఎగుమతి చేయడానికి అనుమతి ఉంటుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(డీజీఎఫ్‌టీ) చెప్పింది.
దీని ప్రకారం 22 క్యారెట్ ప్యూరిటీ కంటే ఎక్కువ మెటల్ కలిగి ఉన్న బంగారం ఆభరణాలు, మెడలియన్స్, ఇతర ఆర్టికల్స్‌ను ఎగుమతి చేయడానికి ఏ ఎగుమతిదారుడికి అనుమతి లేదని పేర్కొంది. కేవలం 8 క్యారెట్ల నుంచి 22 క్యారెట్ల వరకు బంగారమున్న ఆభరణాలు షిప్ చేసే ఎగుమతిదారులకు మాత్రమే ప్రోత్సహాకాలు అందుబాటులో ఉంటాయని కూడా డీజీఎఫ్‌టీ తెలిపింది. కానీ కొంతమంది ఎగుమతిదారులు 22 క్యారెట్ ప్యూరిటీ కలిగిన బంగారు వస్తువులకు కూడా ప్రోత్సహాకాలను అందుకుంటున్నారని జెమ్స్ అండ్ జువెల్లరీ ఎక్స్‌పోర్టు ప్రమోషన్ కౌన్సిల్ అధికారులు పేర్కొంటున్నారు.