న్యూఢిల్లీ: మోదీ సర్కారు మరోసారి కీలక గణాంకాలకు బేస్ ఇయర్‌ను మార్చే చర్యలను మొదలు పెట్టేసింది. జీడీపీ గణాంకాలకు బేస్ ఇయర్‌గా 2011–12 ఉండగా, దీన్ని 2017–18కి చేయాలన్నది ఆలోచన. అలాగే, రిటైల్ ద్రవ్యోల్బణానికి బేస్ ఇయర్ ప్రస్తుతం 2012 కాగా, దీన్ని 2018 చేయాలనుకుంటోంది. ఈ మార్పులు 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి.
‘‘ఆర్థిక వ్యవస్థ, సమాజ ప్రగతిని మరింత కచ్చితంగా లెక్కించేందుకు వీలుగా సవరణలు తోడ్పడతాయి. తదుపరి దశ బేస్ ఇయర్ సవరణకు చర్యలు ప్రారంభమయ్యాయి. జీడీపీకి బేస్ ఇయర్‌గా 2017–18ని చేయనున్నాం. వినియోగదారుల రిటైల్ ద్రవ్యోల్బణానికి బేస్ ఇయర్‌గా 2018కి మార్చనున్నాం’’ అని కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖా మంత్రి సదానంద గౌడ మీడియాకు తెలిపారు.
అధికారిక గణాంకాలను లెక్కించేందుకు ఐక్యరాజ్య సమితి ప్రాథమిక సూత్రాలను 2016లో అమల్లోకి తీసుకున్నట్టు చెప్పారు. తన అవసరాల కోసమే ప్రభుత్వం జీడీపీ, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాల లెక్కింపు విధానాలను మారుస్తోందన్న వాదనను ఆయన కొట్టపడేశారు. బేస్ ఇయర్‌గా ఖరారు చేసిన సంవత్సరంలో ఉన్న గణాంకాలను ఆ తర్వాత సంవత్సరాల్లో వృద్ధికి ప్రామాణికంగా తీసుకుని విలువలను లెక్కిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment