జీడీపీకి బేస్ ఇయర్ మార్పు సాధారణమే
కేంద్ర గణాంకాల శాఖ
న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) లెక్కింపునకు బేస్ ఇయర్‌ను మారుస్తుండటం సర్వసాధారణమైన విషయమేనని, అంతర్జాతీయంగా కూడా ఈ విధానం అమలవుతోందని కేంద్ర గణాంకాల శాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు. మారుతున్న ఎకానమీ తీరుతెన్నుల ప్రకారం ఆర్థిక సమాచారమంతా సమగ్రంగా ఉండేలా ఈ విధానం పాటించడం జరుగుతుందని వివరించారు.
జీడీపీ లెక్కింపునకు బేస్ ఇయర్ మార్పునకు కారణాలపై లోక్‌సభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నపై స్పందిస్తూ ఆయన ఈ మేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. శాఖలో భాగమైన కేంద్రీయ గణాంకాల కార్యాలయం .. బేస్ ఇయర్‌ను 2004–05 నుంచి 2011–12కి మార్చిన సంగతి తెలిసిందే. 2015 జనవరిలో ఇది అమల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు.. పాత సిరీస్ ప్రాతిపదికన కట్టే లెక్కల్లో సరిగ్గా ప్రతిఫలించవు కాబట్టే బేస్ ఇయర్ మార్చినట్లు గౌడ పేర్కొన్నారు.