2017–18కి మారనున్న జీడీపీ బేస్ ఇయర్!
న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి సంబంధించిన బేస్ ఇయర్ ప్రస్తుత 2011–12 నుంచి త్వరలో 2017–18కి మారనుంది. ‘‘ప్రస్తుతం గృహ వినియోగ వ్యయంపై సర్వే జరుగుతోంది. అలాగే దేశంలో కార్మిక శక్తికి సంబంధించి గణాంకాల సేకరణ జరుగుతోంది. ఈ కార్యక్రమాలు 2018తో పూర్తవుతాయి. అటు తర్వాత జీడీపీకి సంబంధించి బేస్ ఇయర్ మారుతుంది’’ అని గణాంకాల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ ఇక్కడ విలేకరులకు తెలిపారు. మూడేళ్ల ప్రభుత్వ పనితీరును వివరించడానికి ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జీడీపీ బేస్ ఇయర్‌ను మార్చడానికి తన మంత్రిత్వశాఖ తగిన మదింపు జరుపుతోందని తెలిపారు.
ఈ సందర్భంగా చీఫ్ స్టాటిస్టీషియన్ టీసీఏ అనంత్ మాట్లాడుతూ, వర్షపాతం, తగిన పాలసీ చర్యల వల్ల ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో చక్కటి ఆర్థిక వృద్ధి నమోదవుతుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. గణాంకాల మంత్రిత్వశాఖ నేతృత్వంలోని కేంద్ర గణాంకాల కార్యాలయం 2015 మొదట్లోనే జీడీపీ బేస్ ఇయర్‌ను 2004–05 నుంచి 2011–12కు మార్చింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ), టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాల బేస్ ఇయర్‌ను గత నెల్లోనే 2004–05 నుంచి 2011–12కు మార్చారు.