సాక్షి, న్యూఢిల్లీ : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఇఎస్‌ఐసీ) ఉద్యోగుల రాజ్య బీమా సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్య బీమా కోసం ఉద్యోగులు, యాజమాన్యం చెల్లిస్తున్న మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. సంయుక్తంగా దీన్ని 6.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం కేంద్ర కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వచ్చే నెల (జూలై) ఒకటవ తేదీ నుంచి అమలులోకి రానుంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఈఎస్ఐపై కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం.
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ కింద 6.5 శాతం నుండి 4 శాతానికి తగ్గించేందుకు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 6 శాతం చెల్లింపు వాటాలో ఎంప్లాయర్ (యజమాని) 4.75 శాతం, ఉద్యోగి 1.75 శాతం చెల్లించేవారు. తాజా ఆదేశాల ప్రకారం జూలై 1వ తేదీ నుంచి యాజమాన్యం వాటా 4.75 నుంచి 3.25 శాతానికి, ఉద్యోగి వాటా శాతం 1.75 నుంచి 0.75 శాతానికి తగ్గనుంది. ఈ నిర్ణయం వల్ల 3.6 కోట్ల మంది ఉద్యోగులకు, 12.85 లక్షల యాజమాన్యాలకు ప్రయోజనం చేకూరనుంది. దీని వల్ల సంబంధిత ఇండస్ట్రీకి ఏడాదికి రూ.5,000 కోట్లు ఆదా కానున్నాయని కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఉద్యోగులు, యాజమాన్యాలు చెల్లించే మొత్తాన్ని తగ్గించడం ద్వారా మరింత మంది ఈఎస్‌ఐలో చేరే అవకాశం ఉందని, దీనివల్ల వారు కూడా సంఘటిత రంగ కార్మికులుగా మారతారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంలో భాగంగా యాజమాన్యాలపై భారం తగ్గించాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈఎస్ఐకి చందాల రూపంలో రూ.22,279 కోట్లు సమకూరాయి.
కాగా జనవరి 1, 2017 నుంచి అప్పటివరకూ రూ. 15 వేలుగా ఉన్న వేతన పరిమితిని 21 వేలకు పెంచింది. దీంతో ప్రస్తుతం నెలకు రూ.21,000 వరకు వచ్చేవారు ఈఎస్ఐ బెనిఫిట్స్‌కు అర్హులు. నెలకు రూ. 21వేల లోపు జీతం ఉన్నవారు ఈఎస్‌ఐలో చేరితే వారికి అనారోగ్య సమయంలో వైద్యసేవలతో పాటు, సందర్భాన్నిబట్టి నగదు సాయం కూడా లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment