న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) కుంభకోణంలో ఆ బ్యాంకు మాజీ ఎండీ ఉషా అనంత సుబ్రమణియన్‌ను కేంద్ర ప్రభుత్వం డిస్మిస్ చేసింది. ఈ మేరకు సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం అలహాబాద్ బ్యాంకు ఎండీ, సీఈఓగా ఉన్న ఉషా పదవీ కాలం సోమవారంతో ముగియగా అదేరోజున కేంద్రం ఈ ఉత్తర్వులు వెలువరించటం గమనార్హం. ఉషాతో పాటు పీఎన్‌బీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ శరణ్‌ను విచారించేందుకు సీబీఐకి అనుమతిని కూడా కేంద్రం మంజూరు చేసింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకును వజ్రాభరణాల వ్యాపారవేత్త నీరవ్ మోదీ దాదాపు రూ. 14,000 కోట్ల మేర మోసం చేసిన కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉషా అనంతసుబ్రమణియన్ గతంలో రెండు దఫాలుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు సారథ్యం వహించారు. 2011 జూలై నుంచి 2013 నవంబర్ దాకా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గాను, 2015 ఆగస్టు నుంచి 2017 మే దాకా ఎండీ, సీఈవోగా వ్యవహరించారు.
నీరవ్ మోదీ స్కామ్ ప్రారంభమైనది కూడా దాదాపు ఆ సమయంలోనే. కొన్నాళ్లుగా ఉషా అనంతసుబ్రమణియన్ అలహాబాద్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే స్కామ్ దరిమిలా ఆమె అధికారాలకు బ్యాంకు కత్తెర వేసింది. సీబీఐ చార్జిషీటులో ఉషాతో పాటు ఇద్దరు మాజీ ఈడీలైన బ్రహ్మాజీ రావు, సంజీవ్ శరణ్ పేర్లు ఉన్నాయి. ఆమెతో పాటు ఇతర సీనియర్ బ్యాంక్ అధికారులకు అక్రమ లావాదేవీల గురించి తెలిసినప్పటికీ.. వారు దిద్దుబాటు చర్యలేమీ తీసుకోలేదని అభియోగాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment