సాక్షి, ముంబై: ప్రముఖ ఇన్‌ఫ్రా కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్)కు కేంద్ర ప్రభుత్వం సత్యం లాంటి ఆపరేషన్ చేపట్టింది. డిఫాల్టర్‌గా నమోదైన ఈ సంస్థ బోర్డును కేంద్రం రద్దు చేసింది. మేనేజ్‌మెంట్‌ను తన స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) ముంబై బ్రాంచ్ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ప్రస్తుత బోర్డు స్థానంలో తాత్కాలికంగా మరో బోర్డును కేంద్రం ప్రతిపాదించింది. దీనికి నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొటక్ మహింద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కొటక్ నియమితులయ్యారు. ముంబై బెంచ్ జడ్జీలు ఎంకే శ్రావత్, రవికుమార్ దురైసమీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రభుత్వ పిటిషన్‌ను సమర్దిస్తున్నామని ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ ప్రకటించింది. తాజా పరిణామంతో ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ సంస్థ మరో సత్యం ఉదంతం కానుందనే అంచనాలు భారీగా నెలకొన్నాయి.
కాగా ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఈ గ్రూప్ మొత్తం బకాయిలు రూ. 90వేల కోట్లు ఉండగా, వీటిలో బ్యాంకులు రుణాలు రూ. 57వేల కోట్ల దాకా ఉన్నాయి. అయితే కంపెనీ పునర్ వ్యవస్థీకరిస్తే తాము రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వివిధ ఆర్థిక సంస్థలు పేర్కొనడంతో కంపెనీ మేనేజ్‌మెంట్‌ను మార్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. నిపుణులు కూడా ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ సమస్య పరిష్కారానికి సత్యం తరహా పరిష్కారం మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరోవైపు తమ రుణాలను తీర్చే ప్రణాళికలో ఉన్నట్టు సంస్థ ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ గ్రూపు వైస్ చైర్మన్, ఎండీ హరి శంకర్ శనివారం ప్రకటించారు. ఆర్థిక సంక్షోభంలో ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్.. తక్షణ మూలధన అవసరాలు తీర్చుకునేందుకు రైట్స్ ఇష్యూ ద్వారా రూ.4,500 కోట్లు సేకరించే ప్రతిపాదనకు సంస్థ మాజీ బోర్డు శనివారం ఆమోదం తెలిపింది. అలాగే తమకు ద్రవ్య మద్దతు ఇవ్వాల్సిందిగా సంస్థ ప్రధాన ప్రమోటర్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ, 25.34 శాతం వాటా), ఎస్‌బీఐను కోరారు. ఈ నేపథ్యంలో సోమవారం ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ షేర్లు 17శాతం పుంజుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment