
సాక్షి, న్యూఢిల్లీ : ఎల్‌పీజీ ధరల పెంపుపై ప్రభుత్వం ఊరట ఇచ్చింది. ప్రతి నెల ఒక్కో ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.4 ధర పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సబ్సిడీలను ఎత్తివేసే క్రమంలో 2017 జూన్ నుంచి ప్రతి నెలా ఒక్కో ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.4 ధర పెంచాలని ప్రభుత్వం, అంతకముందు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఆర్డర్‌ను అక్టోబర్ నుంచి ఎత్తివేసినట్టు ప్రభుత్వ టాప్ వర్గాలు చెప్పాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఇండియా, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లు అక్టోబర్ నుంచి ఎల్‌పీజీ ధరలను పెంచడం లేదని పేర్కొన్నాయి. ఆయిల్ కంపెనీలు ఎల్‌పీజీ రేట్లను 10 సార్లు పెంచాయి.
ఏడాదిలో ప్రతి గృహ వినియోగానికి సబ్సిడీ ధరలో 12 సిలిండర్లను అందిస్తున్నారు. ఒకవేళ ఇంకా ఎక్కువ కావాలంటే మార్కెట్ ధరలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 2017 జూన్ నుంచి ఒక్కో సిలిండర్‌పై రూ.4 పెంచుతూ.. 2018 మార్చి నాటికి లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే లోపల వీటిపై ప్రభుత్వం అందించే సబ్సిడీని జీరో చేయాలని భావించింది. కానీ ధరల పెంపుకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఒకవైపు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లను ఇస్తూ... మరోవైపు ధరలు పెంచడం సబబు కాదని వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ధరల పెంపు ఆర్డర్‌ను ప్రభుత్వం ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment