సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ ఆధారిత వాహనాల (ఎలక్ట్రిక్ వాహనాలు) పై కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాలపై రిజిస్ట్రేషన్ ఫీజును రద్దు చేయాలని నరేంద్ర మోదీ సర్కార్ ప్రతిపాదించింది. ఈ మేరకు బుధవారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం సెంట్రల్ మోటర్ వెహికిల్స్ రూల్స్ (సీఎంవీఆర్) 1989 చట్టాన్ని సవరించినట్లు తాజా డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. బ్యాటరీతో నడిచే వాహనాలకు రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పింది. ఈ మేరకు నిబంధన 81లో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది.
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ విడుదల చేసిన ముసాయిదా ప్రకటన ప్రకారం పర్యావరణ హిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సాహమిచ్చే చర్యల్లో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాలుష్యం ఉద్గారాలు వెదజల్లని ఈవీ వాహనాల వినియోగాన్ని భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే పదేళ్ల తర్వాత (2030) కేవలం ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని నీతి అయోగ్ కూడా సూచనలు చేసిందని తెలుస్తోంది.
2030 నాటికి వాడకంలో విద్యుత్ వాహనాలే ఉండాలన్నదే లక్ష్యం. అలాఇందులో భాగంగానే విద్యుత్ ఆధారిత వాహనాల వైపు వాహనదారులు చూసేలా రిజిస్ట్రేషన్ చార్జీలను ఎత్తివేయాలని ప్రతిపాదించింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, పాత వాహనాల రెన్యువల్ కోసం కూడా ఎలాంటి చెల్లింపులు జరపనక్కర్లేదని స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ టూవీలర్లతో పాటు త్రీ వీలర్, ఫోర్ వీలర్ మిగతా అన్ని విద్యుత్ ఆధారిత వాహనాలకు ఇది వర్తిస్తుందని ప్రకటించింది. కాగా, తమ ఈ నిర్ణయంపై నెల రోజుల లోపు అభిప్రాయాలను తెలుపవచ్చని రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment