మళ్లీ గోల్డ్ బాండ్‌లు..
స్కీమ్ రెండవ విడత ప్రారంభం
♦ జనవరి 22న ఇష్యూకు ముగింపు
♦ 99.9 ప్యూరిటీ గ్రాముకు రూ.2,600
♦ వార్షిక వడ్డీరేటు 2.75 శాతం
ముంబై: రెండవ విడత సావరిన్ గోల్డ్ పథకం సోమవారం ప్రారంభమైంది. 22వ తేదీ (శుక్రవారం) వరకూ ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఇష్యూకు సంబంధించి 99.9 స్వచ్ఛత ధర గ్రాముకు రూ.2,600గా ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించిన సంగతి తెలిసిందే. గోల్డ్ బాండ్లపై ప్రభుత్వం 2.75 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ ఏడాది జనవరి 11-15 తేదీల్లోని 99.9 స్వచ్ఛత బంగారం ధర సగటు ఆధారంగా బాండ్ల ధర నిర్ణయం జరిగింది. గోల్డ్ బాండ్లు కొనుగోలు చేయాలని భావించే ఇన్వెస్టర్లు జనవరి 18 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, స్టాక్ హోల్డింగ్స్ కార్పొరేషన్‌లలో ఇందుకు సంబంధించి దరఖాస్తులను ప్రత్యక్షంగాకానీ లేదా ఏజెంట్ల ద్వారా దాఖలు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు చూస్తే...
బంగారం బాండ్ల మంజూరు ప్రక్రియ ఫిబ్రవరి 8 నుంచి ఉంటుంది.
నవంబర్ 5 నుంచి 20వ తేదీ వరకూ సాగిన... తొలి విడత గోల్డ్ బాండ్ల ధర (గ్రాముకు రూ.2,684)తో పోలిస్తే ప్రసుత్తం గోల్డ్ బాండ్ల ధర గ్రాముకు రూ.84 తక్కువగా ఉంది. {పజలు 2 గ్రాముల నుంచి 500 గ్రాముల పరిమాణం వరకు బాండ్లను కొనుగోలు చే యవచ్చు. ఒక వ్యక్తి ఏడాదిలో 500 గ్రాములకు మించిన విలువగల పసిడి బాండ్లు కొనుగోలు చేయడానికి వీలులేదు. బంగారం బాండ్ల జారీ ఫిబ్రవరి 8న. మెచ్యూరిటీ కాలం- జారీ తేదీ నుంచి 8 ఏళ్లు. బంగారం బాండ్లపై వచ్చిన వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. ఐదేళ్ల నుంచే ముందస్తు నగదు మార్పిడి అమల్లో ఉంటుంది. బాండ్ మెచ్యూరిటీ సమయంలో ఉన్న ధరకు అనుగుణంగా అందుకు సమానమైన పసిడి లేదా నగదు విలువను ఇన్వెస్టర్ పొందవచ్చు.
రుణాలు పొందడానికి హామీగా బాండ్లను వినియోగించుకోవచ్చు. సెంట్రల్ బ్యాంక్ నోటిఫై చేసిన తేదీ నుంచీ బాండ్లు ట్రేడయ్యే అవకాశం ఉంది. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మినహాయింపులు వర్తిస్తాయి.
నిధుల సమీకరణ లక్ష్యం కష్టమే..!
గోల్డ్ బాండ్ పథకం ద్వారా మార్చి నాటికి రూ.15,000 కోట్లు సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఈ లక్ష్యాన్ని సాధించడం అసాధ్యమని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రభుత్వ మార్కెట్ రుణ సమీకరణ కార్యక్రమంలో గోల్డ్ బాండ్ స్కీమ్ భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. నవంబర్‌లో ప్రారంభమైన తొలి విడత గోల్డ్ బాండ్ల మంజూరు ప్రక్రియలో ప్రజల నుంచి 62,169 దరఖాస్తులు వచ్చాయి. రూ.246 కోట్ల విలువైన 916 కిలోల బంగారు బాండ్లు కొనుగోలు చేశారు. లక్ష్యంతో పోల్చితే ఈ సమీకరణ తక్కువే కావడం గమనార్హం.
పసిడి డిపాజిట్ స్కీమ్‌లో సోమనాథ్ దేవాలయ బంగారం!
అహ్మదాబాద్: గోల్డ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడులు పెట్టడానికి గుజరాత్‌కు చెందిన ప్రముఖ సోమనాథ్ దేవాలయం ట్రస్ట్ సిద్ధమయ్యింది. దేవాలయానికి సంబంధించి రోజూవారీ వినియోగించకుండా ఉంటున్న పసిడిని డిపాజిట్ పథకంలో పెట్టుబడిగా పెట్టాలని ట్రస్ట్ నిర్ణయించింది. దేవాలయం ట్రస్టీ సభ్యుల్లో ప్రధాని నరేంద్రమోదీ కూడా ఉన్నారు. స్వచ్ఛత, ఆభరణాల పసిడి కలిసి ప్రస్తుతం దేవాలయం వద్ద దాదాపు 35 కేజీల పసిడి ఉంది.
ఇందులో రోజువారీగా వినియోగించని పసిడిని (స్వచ్ఛత) వేరుచేసి డిపాజిట్ చేయాలని ప్రధాని మోదీ నివాసంలో ఈ నెల 12న జరిగిన ట్రస్టీ సభ్యుల సమావేశం నిర్ణయించినట్లు ట్రస్ట్ సెక్రటరీ పీకే లాహిరి సోమవారం తెలిపారు. ఇది కార్యరూపం దాల్చితే పసిడి డిపాజిట్ పథకంలో చేరిన మొట్టమొదటి దేవాలయంగా గుజరాత్ సోమనాథ్ దేవాలయం నిలవనుంది. కేంద్రం ప్రవేశపెట్టిన రెండు పసిడి పథకాల్లో బాండ్స్‌తో పాటు పసిడి డిపాజిట్ కూడా ఒకటి. అయితే డిపాజిట్ స్కీమ్‌కు ప్రజల నుంచి పెద్దగా స్పందన లభించలేదు.