
న్యూఢిల్లీ: బీమా రంగానికి మరింత ఊతమిచ్చే దిశగా ఇన్సూరెన్స్ బ్రోకింగ్‌లోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించే అంశాన్ని కేంద్రం చురుగ్గా పరిశీలిస్తోంది. ప్రస్తుతం బ్రోకింగ్, బీమా కంపెనీలు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్ మొదలైన బీమా రంగ వ్యాపార విభాగాల్లోకి 49 శాతం వరకూ మాత్రమే ఎఫ్‌డీఐలను అనుమతిస్తున్నారు. ‘బీమా బ్రోకింగ్ కూడా ఇతరత్రా ఆర్థిక సేవలు, కమోడిటీ బ్రోకింగ్ సేవల్లాంటిదే. ఇందులో వంద శాతం ఎఫ్‌డీఐలను అనుమతించాలనే యోచన ఉంది. ఇటీవలే అత్యున్నత స్థాయి అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో ఈ అంశాన్ని చర్చించారు.
ప్రభుత్వం ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలిస్తోంది‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, బీమా కంపెనీల్లో మాత్రం ప్రస్తుతం ఉన్న 49 శాతం ఎఫ్‌డీఐ పరిమితిని యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని స్పష్టం చేశాయి. 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతులున్న ఆర్థిక సర్వీసుల బ్రోకింగ్ సంస్థలతో సమానంగా బీమా బ్రోకింగ్ సంస్థలను కూడా పరిగణించాలంటూ పరిశ్రమ వర్గాల నుంచి ప్రభుత్వానికి ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తులు వచ్చాయని సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు. ‘‘దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి ఇటీవలే సంబంధిత వర్గాలతో సమావేశమయ్యారు.
ఈ అంశంపై అభిప్రాయాలు తెలియజేయాలంటూ పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగానికి (డీఐపీపీ) ప్రధాని కార్యాలయం సూచించింది కూడా’’ అని ఆయన వివరించారు. కాగా ఇప్పటికే వాలెట్ ద్వారా ఆర్థిక సేవల్లోకి ప్రవేశించిన విదేశీ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్... తాను బీమా బ్రోకింగ్ సేవల్ని కూడా ఆరంభించాలని చూస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ప్రభుత్వం గనక అనుమతిస్తే బహుశా! తొలిసారి ఈ సేవల్లోకి ప్రవేశించే విదేశీ కంపెనీ అమెజాన్ కావచ్చన్నది మార్కెట్ వర్గాల మాట.
Comments
Please login to add a commentAdd a comment