
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మంగళ, బుధవారాల్లో (3, 4 తేదీలు) నాలుగో ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష నిర్వహించనుంది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీపీ) ప్రధానంగా బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 6 శాతం) తగ్గించే అంశంపై ఈ సమావేశంలో చర్చించనుంది. ప్రస్తుతం రెపో ఏడేళ్ల కనిష్ట స్థాయి. 10 నెలల తరువాత ఆగస్టులో పావుశాతం తగ్గించడంతో రెపో ఈ స్థాయికి తగ్గింది.
రేటు కోత అంచనాలకు కారణం...
♦ డీమోనిటైజేషన్ ఎఫెక్ట్ ప్రధాన కారణంగా– స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) జూన్ (ఏప్రిల్–జూన్) త్రైమాసికంలో మూడేళ్ల కనిష్ట స్థాయి 5.7 శాతానికి పడిపోయింది.
♦ పారిశ్రామిక వృద్ధి మందగమనం (జూలై పారిశ్రామిక ఉత్పత్తి– ఐఐపీ వృద్ధి రేటు కేవలం 1.2 శాతంగా నమోదయింది) కొనసాగుతోంది.
♦ జూలై నుంచీ అమల్లోకి వచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమల్లో క్లిష్టత కూడా వృద్ధి తగ్గుదలకు కారణం అవుతోందన్న నేపథ్యంలో– ఇందుకు సంబంధించి తక్కువ పన్ను శ్లాబుల్ని అమల్లోకి తీసుకువచ్చే విషయాన్నీ ఆలోచిస్తోంది.
♦ ప్రభుత్వానికి లభించే ఆదాయ–వ్యయాల మధ్య వ్యత్యాసం ద్రవ్యలోటు లక్ష్యం (ఈ ఏడాది 3.2 శాతం) సడలింపు వార్తలు వినిపిస్తున్నాయి.
♦ డాలర్ మారకంలో రూపాయి విలువ మళ్లీ ‘యూ’ టర్న్(క్షీణించడం) తీసుకుంటుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
♦ ఇటువంటి ఆర్థిక మందగమన పరిస్థితుల్లో– కేంద్రం ఉద్దీపణలు అవసరమన్న ప్రకటనలు వెలువడుతున్నాయి.
♦ ఈ నేపథ్యంలో వృద్ధికి రేటు కోత అవసరమని అటు ప్రభుత్వ వర్గాల నుంచీ ఇటు పారిశ్రామిక వర్గాల నుంచి విజ్ఞప్తులు వెలువడుతున్నాయి.
అడ్డుపడేది ద్రవ్యోల్బణమే!
అయితే పాలసీ యథాతథ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని పలువురు బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ద్రవ్యోల్బణం (ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదేళ్ల గరిష్ట స్థాయిలో 3.36 శాతం) పెరుగవచ్చన్న ఆందోళన ఇందుకు కారణంగా వారు చూపిస్తున్నారు.
క్రూడ్ జోరు, ద్రవ్యలోటు సడలించవచ్చన్న ఊహాగానాలు, రూపాయి బలహీనత వంటి అంశాలు ఆర్‌బీఐ యథాతథ పరిస్థితి కొనసాగిస్తుందనడానికి కారణాలుగా వారు పేర్కొంటున్నారు. ‘అక్టోబర్ 4న ఆర్‌బీఐ కీలక రుణ రేటు విషయమై యథాతథ పరిస్థితి కొనసాగించే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు దీనికి ప్రధాన కారణం’ అని ఎస్‌బీఐ, మోర్గాన్ స్టాన్లీ నివేదికలు పేర్కొంటున్నాయి.