బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్‌కు చట్టబద్ధత!
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాల నాణ్యతను ధృవీకరించే హాల్‌మార్కింగ్‌కి చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (బీఐఎస్) చట్టానికి సవరణలు చేయాలని భావిస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. అయితే, హాల్‌మార్కింగ్ ప్రక్రియ స్వచ్ఛందంగా పాటించేలా ఉంచాలా లేక తప్పనిసరి చేయాలా అన్న అంశంపై నిర్ణయమేదీ తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. బీఐఎస్ చట్ట సవరణల్లో మార్పుల విషయంలో సంబంధిత వర్గాలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు.
ఆభరణాలు విక్రయించే సంస్థలు వివిధ క్యారట్ల బంగారం, వాటి రేట్ల గురించి కొనుగోలుదారులకు అసలు తెలియజేస్తున్నారా లేదా అన్న అంశం గురించి ఆయన ఆరా తీశారు. ‘నేను 18-24 క్యారట్ల స్వచ్ఛత బంగారం గురించే విన్నాను. 9 క్యారట్ల బంగారం కూడా ఉంటుందన్నది నాకు తెలియదు’ అని పాశ్వాన్ వ్యాఖ్యానించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని బీఐఎస్‌ను ఆదేశించారు. ఇందుకు సంబంధించి కొనుగోలుదారుల ప్రయోజనాల పరిరక్షణపై మరింతగా దృష్టి పెట్టాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ అధికారులకు సూచించారు.
18-24 క్యారట్స్ ఆభరణాలు మాత్రమే బీఐఎస్ సర్టిఫై చేయాలంటూ తమ శాఖకు సూచనలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో దీనిపై బీఐఎస్ నివేదిక ఇచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. బంగారు ఆభరణాల స్వచ్ఛత గురించి ధృవీకరించేలా 2000 ఏప్రిల్ నుంచి బీఐఎస్ హాల్‌మార్కింగ్ ప్రక్రియను ప్రవేశపెట్టింది. దీని కింద జ్యుయెలర్లు తమ ఆభరణాలను హాల్‌మార్కింగ్ చేసేందుకు బీఐఎస్ నుంచి లెసైన్సు పొందాల్సి ఉంటుంది.