కొత్త నిబంధనతో తీరని కష్టం.. కొనుగోలు.. అమ్మకాలను పట్టించుకోరా? కనకం.. విక్రయాలకు హాల్‌మార్క్ శాపం.. బంగారు వ్యాపారం.. తీరని భారం.. అంటూ.. బంగారు వ్యాపారులు నినాదాలతో హోరెత్తించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హాల్‌మార్క్ నిబంధనను వ్యతిరేకిస్తూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: హాల్‌మార్క్ విధానంతో తమ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటాయని బంగారు వర్తకులు, దుకాణ యజమానులు వాపోయారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నగల దుకాణాలను మూసివేసి కేంద్ర తీరుపై నిరసన వ్యక్తం చేశారు. దుకాణాల ద్వారా అమ్మకాలు సాగించే బంగారు నగలపై వాటి నాణ్యతను నిర్ధారించే ‘హాల్‌మార్క్’ ముద్రను విధిగా వేయాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) తేల్చి చెప్పింది. ఈమేరకు కొత్తగా నిబంధనలను అమల్లోకి తెచ్చింది. అయితే ఈ విధానాన్ని బంగారు నగల వర్తకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హాల్‌మార్క్ నిబంధన బంగారు నగల అమ్మకాలపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది, ధరలు పెరగడంతో పాటు.. నగల దుకాణాల్లో పనిచేసే సిబ్బంది ఉద్యోగాలు కోల్పోతారని అంటున్నారు.
అంతేగాక కొనుగోలుదారులు తమ వ్యక్తిగత వివరాలు తెలపాల్సి రావడం వల్ల భద్రతాపరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయని వాదిస్తున్నారు. ఏ మేరకు, ఎంత ఖరీదైన నగలు కొంటున్నారో వివరాలు తెలపాల్సి రావడం ప్రజల వ్యక్తిగత సమాచార భద్రత హక్కును హరించడమే అవుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ హాల్‌మార్క్ విధానాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ చెన్నైలోని 7వేలు సహా.. రాష్ట్రవ్యాప్తంగా 35 వేల బంగారు నగల దుకాణాలను ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు మూసివేశారు.
చెన్నై టీనగర్, పురసైవాక్కం, ప్యారిస్ కార్నర్, రాధాకృష్ణన్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో బంగారు నగల వ్యాపారస్తులు ప్లకార్డులు చేతబూని మానవహారం చేపట్టారు. అలాగే తిరుచ్చిరాపల్లె, మధురై, తిరునెల్వేలి, సేలం, ఈరోడ్, కోయంబత్తూరు తదితర నగరాల్లో సైతం బంగారు నగల దుకాణాలు మూసివేసి కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రభుత్వం స్పందించకుంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని తమిళనాడు బంగారు నగల దుకాణాల యజమానుల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. చెన్నై బంగారు నగల వర్తకుల సంఘం అధ్యక్షుడు ఉదయ్ ఉమ్మడి మీడియాతో మాట్లాడుతూ, అరుదైన రకాలకు హాల్‌మార్క్ ముద్ర పొందడం మన దేశానికి సంబంధించి వినియోగదారుల అభీష్టంగా కొనసాగుతూ వస్తోందని అన్నారు.
అయితే దీనిని ఇకపై అన్ని రాష్ట్రాల్లో విధిగా పాటించాలని బీఐఎస్ పేర్కొనడం సమంజసం కాదన్నారు. తమిళనాడులో హాల్‌మార్క్ ముద్రకు సంబంధించి సరైన వసతులు లేనందున 16 నుంచి 18 కోట్ల సంఖ్యలో బంగారు నగలు విక్రయానికి నోచుకోక మూలపడి ఉన్నాయని.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న హాల్‌మార్క్ సంస్థ రోజుకు రెండు లక్షల నగలకు మాత్రమే ముద్ర వేసే సామర్థ్యం కలిగి ఉందని వెల్లడించారు.
దీనివల్ల సుమారు మూడేళ్లకు అవసరమైన బంగారు నగలు అమ్మకాలకు నోచుకోక నిలిచిపోయే పరిస్థితి దాపురిస్తుందని వాపోయారు. మూడు నాలునాగేళ్ల తరువాత హాల్‌మార్క్ ముద్రతో కూడిన బంగారు నగలు విఫణివీధిలోకి వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే అనే క సమస్యలను ఎదుర్కొంటున్న బంగారు నగల వర్తకులపై హాల్‌మార్క్ విధానం ఒక పిడుగుపాటు లాంటిదని ఆయన అభివర్ణించారు. ఈ విధానం వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా దెబ్బతింటారని ఆయన వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment