మరోసారి అరుణ్‌శౌరి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఆర్థిక వేత్త, పాత్రికేయుడు , బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలా ఉంది తప్ప ప్రభుత్వంలా వ్యవహరించడంలేదని మండిపడ్డారు. మేధావులు, నిపుణులతో సంప‍్రదింపులు, సమీక్షలు జరపకుండా, ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని విరుచుకు పడ్డారు. దీని ఫలితమే నోట్ల రద్దు నిర్ణయమన్నారు. మూడేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం సాధించింది ఏమీలేదన్నారు. పైగా అనేక రంగాల్లో క్షీణతను నమోదు చేసిందని శౌరి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఉద్యోగాల కల్పనలో తీవ్ర వైఫ్యలం చెందిందని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలా ఉంది తప్ప ప్రభుత్వంలా వ్యవహరించడంలేదని మండిపడ్డారు. ఎందుకంటే ఎవరితోనూ ఎలాంటి సంప్రదింపులు జరపకుండా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. ఈ క్రమంలో దేశీయ ఆర్థిక విధానానికి సంబంధించి డీమానిటైజేషన్ తీవ్రమైన తప్పిదమని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ భద్రతా విధానంలో, విదేశీ విధానం, ముఖ్యంగా చైనాతో సంబంధాలు తదితర అంశాల్లో ఇలాంటి తప్పుడు నిర్ణయాలు జరిగితే దీని ప్రభావం దారుణంగా ఉంటుందన్నారు. ఇది దేశానికి మంచిదికాదని, దీని ఫలితాలు భారీ విపత్తుకు దారతీస్తాయని పేర్కొన్నారు. అన్నిరంగాల్లో వృద్ధి క్షీణతను నమోదు చేస్తోంటే. జీడీపీ 7శాతంవృద్ధి ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఐటీ రంగంలో ఉద్యోగాల సంక్షోభంపై మాట్లాడుతూ టెక్నాలజీ పరుగులుపడుతున్న నేపథ్యంలో సాంకేతిక నైపుణ్యాలకు అప్‌గ్రేడ్ కావాల్సిన అవసరం ఉందని అరుణ్ శౌరి అభిప్రాయపడ్డారు.
కాగా మోదీ ప్రభుత్వంపై గత ఏడాదికూడా అరుణ్ శౌరి విమర్శలు గుప్పించారు. మోదీ ఏకవ్యక్తి పాలన కొనసాగిస్తున్నారనీ, దీనివల్ల భారత ప్రజాస్వామ్యానికి చేటు తప్పదని ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే.