న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌కు జీఎస్టీ వసూళ్లు ఆశ్చర్యపరిచాయి. రెండు నెలల పాటు భారీగా క్షీణించిన జీఎస్టీ వసూళ్లు, రూ.86,703 కోట్లకు పెరిగాయి. డిసెంబర్ నుంచి జనవరి 25 వరకు రూ.86,703 కోట్ల జీఎస్టీ వసూలైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2018 జనవరి 24 వరకు జీఎస్టీ కింద మొత్తం కోటి మంది పన్ను చెల్లింపుదారులు రిజిస్టర్ అయినట్టు తెలిపింది. వీరిలో 17.11 లక్షల మంది కంపోజిషన్ డీలర్లున్నారని పేర్కొంది.
ఇప్పటి వరకు 56.30 లక్షల మంది జీఎస్టీఆర్ 3బీ రిటర్నులను దాఖలు చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. 2017 డిసెంబర్ క్వార్టర్ చివరి నాటికి మొత్తం 9.25 లక్షల రిటర్నులను మాత్రమే కంపోజిషన్ డీలర్లు ఫైల్ చేయగా... రూ.421.35 కోట్లు వసూలయ్యాయి. కాగ, గత రెండు నెలల నుంచి జీఎస్టీ వసూళ్లు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. వచ్చే వారంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలో ఈ వసూళ్లు పెరిగి, కేంద్రానికి మంచి బూస్ట్‌ను అందించాయి.
Comments
Please login to add a commentAdd a comment