ఖాదీకి గుడ్‌న్యూస్.. కార్లకు బ్యాడ్‌న్యూస్
ఖాదీకి గుడ్‌న్యూస్.. కార్లకు బ్యాడ్‌న్యూస్
Published Sat, Sep 9 2017 8:15 PM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM
సాక్షి, హైదరాబాద్: ఓవైపు ఖాదీకి శుభవార్త చెప్పిన జీఎస్టీ కౌన్సిల్... మరోవైపు కార్లపై పన్ను రేట్లను బాదేసింది. ఖాదీ వస్తువులను పూర్తిగా జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్టు చెప్పిన ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ... పెద్ద కార్లపై పన్నులను 43 శాతం నుంచి 48 శాతం పెంచారు. మధ్యస్థాయి కార్లపై 2 శాతం, పెద్ద కార్లపై 5 శాతం, ఎస్‌యూవీలపై 7 శాతం సెస్‌ను పెంచుతున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. దీంతో ఎస్‌యూవీలపై మొత్తం పన్ను 43 శాతానికి బదులు, 50 శాతం మోతక్కనుంది.
చిన్నకార్లు, 13 సీట్లు, హైబ్రిడ్ వాహనాలపై మాత్రం జీఎస్టీ కౌన్సిల్ స్టేటస్ క్వోను పాటించినట్టు చెప్పారు. ఈ పండుగ సీజన్‌లో చిన్న కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ప్రకటన ఊరటగా మారింది. మరోవైపు మధ్యరకం కార్ల విడిభాగాలపై పన్ను రేట్లను 5 శాతం తగ్గించారు. ఈ పన్ను రేట్లు 48 శాతం నుంచి 43 శాతానికి దిగొచ్చాయి. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన జీఎస్టీ 21వ కౌన్సిల్ భేటీ ముగిసిన అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడారు.
ట్రేడ్‌మార్కు, బ్రాండెడ్ ఆహారపదార్థాలపై 5 శాతం పన్నును విధించినున్నట్టు చెప్పారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక రెండోసారి భేటీ అయ్యామని, జీఎస్టీ పురోగతిపై సమావేశంలో చర్చించామని తెలిపారు. నేడు జరిగిన సమావేశంలో 30 వస్తువుల పన్నురేట్లపై చర్చలు జరిపినట్టు తెలిపారు. అర్హులైన వారిలో 70 శాతానికిపైగా జీఎస్టీలోకి మారినట్టు చెప్పారు. జీఎస్టీ ఫైల్‌చేయడంలో కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సులభతరమైన ప్రక్రియ కోసం కమిటీని కూడా ఏర్పాటుచేయాలని కౌన్సిల్ నిర్ణయించినట్టు తెలిపారు. సాంకేతిక కారణాల సమస్యతో జీఎస్టీఆర్-1 ఫైల్‌చేయడానికి గడువును కూడా అక్టోబర్10 వరకు జీఎస్టీ కౌన్సిల్ పొడిగించింది.
Advertisement