ఇంటిపై జీఎస్‌టీ భారం!
♦ నిర్మాణాలపై 12%, లే–అవుట్లపై 18% జీఎస్‌టీ
♦ ఇంటి అద్దెలపై జీఎస్‌టీ లేదు; వాణిజ్య, ఆఫీసు అద్దెలపై మాత్రం 18%
♦ అందుబాటు గృహాలకు జీఎస్‌టీ మినహాయింపల్లేవ్
♦ డెవలపర్లకూ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ వర్తింపు; కానీ, చివరి 12 నెలలకే
♦ కేసీఆర్ 2 బీహెచ్‌కే పథకంపై అదనపు భారం
సాక్షి, హైదరాబాద్:
పరోక్ష పన్ను విధానంలో స్థిరాస్తి రంగంలోని పన్నులను ఒకసారి పరిశీలిస్తే వేర్వేరు దశలో ఉంటాయి. మొదటి దశలో భూములను కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ. రెండో దశలో లే అవుట్ వేసేందుకు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చినందుకు నాలా పన్ను, స్థానిక సంస్థలైన జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ నుంచి అనుమతి కోసం రుసుములుంటాయి. మూడో దశలో నిర్మాణ సమయంలో నిర్మాణ సామగ్రిపైన ఎక్సైజ్ డ్యూటీ, ఫ్లాట్లను అమ్మినప్పుడు వ్యాట్, సర్వీస్ ట్యాక్స్‌లుంటాయి. ఈ మూడు దశల్లోని పన్నులన్నింటినీ కలిపితే మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 27–33 శాతం వరకు పన్నులుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే జీఎస్‌టీలో మాత్రం పై మూడు దశల్లో మొదటి రెండు దశలకు జీఎస్‌టీతో సంబంధం లేదు. కాబట్టి వాటిల్లో ఎలాంటి మార్పు ఉండదు. మూడో దశలో ఉన్న వ్యాట్, సేవా పన్ను, ఎక్సైజ్.. మూడింటి స్థానంలో ఒకే పన్ను అంటే జీఎస్‌టీ మాత్రమే ఉంటుంది. అయితే వాస్తవానికి స్థిరాస్తి రంగానికి 18 శాతం జీఎస్‌టీని ఖరారు చేశారు. కానీ, భూమి విలువలో 6 శాతం మినహాయింపు కారణంగా 12 శాతం చెల్లిస్తే సరిపోతుంది. కానీ, గతంలో వ్యాట్ (1.25 శాతం), సర్వీస్ ట్యాక్స్ (4.5 శాతం)గా రెండూ కలిపి 5.75 శాతం పన్నులుండేవి. అంటే జీఎస్‌టీతో స్థిరాస్తి రంగంలో పన్నులు 6.25 శాతం పెరిగాయన్నమాట. పైగా గతంలో, జీఎస్‌టీలోనూ రిజిస్ట్రేషన్ చార్జీలు 6.10 శాతం మాత్రం కొనుగోలుదారులు భరించాల్సిందే. కాకపోతే జీఎస్‌టీతో డెవలపర్లకు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ వర్తిస్తుంది. అయితే అది ఎంత? కొనుగోలుదారులకు ఎలా బదిలీ చేస్తారనేదే సందేహం.
లే అవుట్లకు 18 శాతం జీఎస్‌టీ..
భూమి అమ్మకం (సేల్ ఆఫ్ ల్యాండ్) అనేది వస్తువు లేదా సేవల కిందికి రాదు కాబట్టి జీఎస్‌టీ నుంచి మినహాయింపునిచ్చారు. కానీ, లే అవుట్లు చేసి విక్రయిస్తే మాత్రం సేవల కింద పరిగణించి 18 శాతం జీఎస్‌టీని చెల్లించాల్సిందే. పర్మినెంట్ లే అవుట్ తీసుకొని అన్ని వెంచర్లకూ జీఎస్‌టీ వర్తిస్తుంది. లే అవుట్‌లో సబ్ కాంట్రాక్టర్ చేసే రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ లైన్లు, ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకర్ వంటి మౌలిక వసతుల వ్యయంపై 18 శాతం జీఎస్‌టీ పన్నును కట్టాల్సి ఉంటుంది.
వాణిజ్య, ఆఫీసు అద్దెలకూ 18 శాతమే..
నివాస సముదాయాల అద్దెలను జీఎస్‌టీ నుంచి మినహాయించారు. వాణిజ్య, కార్యాలయాల అద్దెలకు మాత్రం 18% జీఎస్‌టీని ఖరారు చేశారు. గతంలో వీటికి 15 శాతం సర్వీస్ ట్యాక్స్ ఉండేది. అంటే 3 శాతం పెరిగింది. మాదాపూర్‌లోని ఓ వాణిజ్య సముదాయంలో చ.అ. అద్దె రూ.40 అనుకుందాం. 1,000 చ.అ. అద్దెకు రూ.40 వేలు అద్దె చెల్లింస్తుంటే దీని మీద గతంలో సర్వీస్ ట్యాక్స్ 15 శాతం అంటే నెలకు రూ.46 వేలు అద్దె ఉండేది. అదే అద్దె ఇప్పుడు 18 శాతం జీఎస్‌టీ కలిపితే రూ.47,200 చెల్లించాల్సి ఉంటుంది.
అందుబాటు గృహాలపై స్పష్టత లేదు..
ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన (పీఎంఈవై) పథకం కింద 30, 60 చ.మీ.లోపు కట్టే ఈడబ్ల్యూఎస్, ఎల్‌ఐజీ గృహాలకు సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ మినహాయింపు ఉంది. అయితే జీఎస్‌టీలోనూ ఈ గృహాలకు మినహాయింపు ఉంటుందా? లేదా? అనేది కేంద్రం స్పష్టతివ్వలేదు. ఒకవేళ వీటికి కూడా 12 శాతం జీఎస్‌టీని చెల్లించాల్సి ఉంటే గనక.. అందుబాటు గృహాలు కాస్తా ఖరీదవుతాయి. జీఎస్‌టీలో కేవలం బెనిఫిషరీ లెడ్ కన్‌స్ట్రక్షన్ నిర్మాణాలను మాత్రమే మినహాయింపునిచ్చారు. అంటే ఈ రకమైన గృహాల నిర్మాణ వ్యయంలో కొంత ప్రభుత్వం, కొంత లబ్ధిదారుడు భరిస్తాడమన్నమాట.
♦ జీఎస్‌టీతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్లూ భారంగా మారనున్నాయి. వీటికి కూడా 12 శాతం పన్ను వర్తిస్తుంది. దీంతో ప్రభుత్వం ఏటా 2 బీహెచ్‌కే నిర్మాణాలకు రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తుండగా.. జీఎస్‌టీతో అదనపు వ్యయం తప్పదన్నమాట. ఇప్పటికే చాలా మంది 2 బీహెచ్‌కే ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్లు నిర్ణయించుకున్న రేట్లు జీఎస్‌టీ అమలుతో లాభదాయకంగా లేదని, తమపై అదనపు భారం పడుతుందని ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారని సమాచారం.
♦ ఒక్కో 2 బీహెచ్‌కేపై ప్రభుత్వ వ్యయమిది.. గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.4 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో గ్రౌండ్+ మూడంతస్తులకైతే రూ.7 లక్షలు, సెల్లార్+ స్టిల్ట్+ తొమ్మిదంతస్తులకైతే రూ.7.9 లక్షల ఖర్చు చేస్తుంది. నీటి సరఫరా, విద్యుత్, అప్రోచ్, ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల ఏర్పాట్లకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.25 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 75 వేలు వ్యయ పరిమితి.
♦ అయితే జీఎస్‌టీలో చెల్లించే పన్నుల్లో సగం రాష్ట్రానికి ఎస్‌జీఎస్‌టీ రూపంలో అందుతాయి కాబట్టి.. రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించే 6.10 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలను పూర్తిగా మినహాయించాలి. లేకపోతే రిజిస్ట్రేషన్ చార్జీలను కనీసం 3 శాతానికి తగ్గించాలి. – జే వెంకట్ రెడ్డి తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్
(టీబీఎఫ్) జనరల్ సెక్రటరీ
ఐటీసీ వర్తింపు; కానీ, చివరి 12 నెలలకే..
పరోక్ష పన్ను విధానంలో నిర్మాణ సామగ్రి సమయంలో చెల్లించే వివిధ రకాల పన్నులకు డెవలపర్లకు క్రెడిట్ లభించేది కాదు. కానీ, జీఎస్‌టీలో మాత్రం ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) వర్తిస్తుంది. అయితే ఇది చివరి 12 నెలలకు మాత్రమే. ఈ నిబంధన ఇతర రంగాలకు సెట్ అవుతుందేమో గానీ నిర్మాణ రంగానికి కుదరదని నిపుణుల అభిప్రాయం. ఎలాగంటే.. స్థిరాస్తి ప్రాజెక్ట్ అనేది మూడునాలుగేళ్ల పాటు జరిగే తంతు. దశల వారీగా నిర్మాణ సామగ్రిని కొనుగోలు చేసి ప్రాజెక్ట్ మొత్తాన్ని పూర్తి చేస్తారు. కానీ, జీఎస్‌టీలో కేవలం చివరి 12 నెలలకు మాత్రమే ఐటీసీ వర్తింపజేస్తే.. మిగిలిన పన్నుల భారం డెవలపర్ మీద పడుతుంది. ఈ భారాన్ని డెవలపర్ కొనుగోలుదారులకే చేరవేస్తాడు.. అంటే ఫ్లాట్ల ధరలను పెంచేస్తాడు. అందుకే ఐటీసీని ప్రాజెక్ట్ మొత్తానికి వర్తింపజేయాలి. అపార్ట్‌మెంట్‌లో భూమి విలువ మీద 1/3 వరకే ఐటీసీ వర్తింపజేస్తున్నారు. ఒకవేళ భూమి విలువ ఎక్కువుంటే మాత్రం పన్నుల భారం డెవలపర్ల మీదే పడుతుంది.
♦ నిర్మాణం పూర్తయిన లేదా సగం పూర్తయిన వాటికి కూడా క్రెడిట్ సదుపాయాన్ని వర్తింపజేశారు. ఉక్కు, సిమెంట్ వంటి నిర్మాణ సామగ్రిని ఇప్పటికే భవన నిర్మాణంలో వినియోగించారు కాబట్టి.. వాటిని పూర్తయిన ఫ్లాట్లుగా భావిస్తారా? లేక అసంపూర్తిగా గుర్తించి క్రెడిట్ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తారా? అనే దానిపై స్పష్టత లేదు.
– సీ శేఖర్ రెడ్డి, భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) మాజీ జాతీయ అధ్యక్షుడు