మెర్సిడెస్ కార్ల ధరలు తగ్గాయ్..
జీఎస్‌టీ ప్రభావంతో రూ.7 లక్షల వరకు కోత
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్ బెంజ్’ తాజాగా తన మేడిన్ ఇండియా వాహన ధరలను రూ.7 లక్షల వరకు తగ్గించింది. కొత్తగా అమల్లోకి రానున్న జీఎస్‌టీ ప్రయోజనాలను కస్టమర్లకు అందించేందుకు ఈ నిర్ణ యం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ధరల తగ్గింపు నిర్ణయం గురువారం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. జూలై 1 నుంచి జీఎస్‌టీని అమలు చేయటంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే మళ్లీ పాత రేట్లనే అనుసరిస్తామని, జీఎస్‌టీ వాడుకలోకి వచ్చాక మళ్లీ ధరలను తగ్గిస్తామని పేర్కొంది.
దేశీయంగా 9 మోడళ్ల తయారీ
మెర్సిడెస్ బెంజ్ దేశీయంగా తొమ్మిది మోడళ్లను తయారుచేస్తోంది. ఇందులో సీఎల్‌ఏ, జీఎల్‌ఏ, జీఎల్‌సీ, జీఎల్‌ఈ, జీఎల్‌ఎస్, సీ–క్లాస్, ఈ–క్లాస్, ఎస్–క్లాస్, మేబ్యాక్ ఎస్500 ఉన్నాయి. వీటి ధరలు రూ.32 లక్షల నుంచి రూ.1.87 కోట్ల (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) శ్రేణిలో ఉన్నాయి. వీటిపై ధరల తగ్గింపు రూ.1.4 లక్షలు నుంచి రూ.7 లక్షల వరకు ఉంటుంది. అంటే సీఎల్‌ఏ సెడాన్‌పై రూ.1.4 లక్షలు, మేబ్యాక్ ఎస్500పై రూ.7 లక్షలు డిస్కౌంట్ పొందొచ్చు. ‘వివిధ రాష్ట్రాల్లో పన్నులు ఏవిధంగా ఉండబోతున్నాయో మాకు అవగాహన వచ్చింది. భవిష్యత్‌పై స్పష్టతతో ఉన్నాం. అందుకే భారత్‌లో తయారయ్యే కార్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ధరలు, జీఎస్‌టీ తర్వాతి ధరల్లోని వ్యత్యాసాన్ని కస్టమర్లకు బదిలీ చేయాలని నిర్ణయించుకున్నాం’ అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో రొనాల్డ్ ఫోల్గర్ వివరించారు.
సగటున 4 శాతం తగ్గింపు
భారత్‌లో తయారయ్యే అన్ని కార్ల ధరలు సగటున 4 శాతం వరకు తగ్గొచ్చని రొనాల్డ్ ఫోల్డర్ తెలిపారు. ‘జీఎస్‌టీ అమలు అనేది ఒక చరిత్రాత్మక అంశం. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో మైలురాయిగా నిలిచిపోతుంది. జీఎస్‌టీ వల్ల దేశంలో వ్యాపార నిర్వహణ మరింత సులభమవుతుంది’ అని వివరించారు. కాగా జీఎస్‌టీ అమల్లోకి వస్తే 1,500 సీసీకిపైగా ఇంజిన్ సామర్థ్యం కలిగిన లగ్జరీ కార్లు, ఎస్‌యూవీలపై పన్ను 50 శాతం నుంచి 43 శాతానికి (28 శాతం జీఎస్‌టీ, 15 శాతం సెస్) తగ్గనుంది.