సాక్షి, న్యూఢిల్లీ: ఒక దేశం, ఒకే పన్ను అంటూ బీజేపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ)పై మరోసారి వినియోగదారులకు, వ్యాపారులకు బంపర్ ఆఫర్ గెల్చుకునే అవకాశాన్ని కేంద్రం పరిశీలీస్తోంది. జీఎస్టీ వినియోగదారుల లావాదేవీలు (బీ టూ సీ) , వ్యాపారాల ఇన్వాయిస్‌లపై ప్రతి నెలా లక్కీ డ్రాలు నిర్వహించనుంది. ఏప్రిల్ 1 నుంచి రూ .10 లక్షల నుంచి రూ .1 కోట్ల మధ్య లాటరీ ఆఫర్లను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వస్తువుల కొనుగోళ్లు సందర్భంగా తప్పనిసరిగా బిల్లులు తీసుకునేలా వినియోగదారులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు.
వస్తువులు కొన్న తర్వాత వినియోగదారులు తీసుకునే బిల్లు ద్వారా లాటరీని గెల్చుకోవడానికి అర్హత పొందుతారు. ఈ పథకం కింద, రెవెన్యూ విభాగం నెలవారీ లక్కీ డ్రాలను నిర్వహిస్తుంది. ఇందులో ఒక బంపర్ బహుమతితోపాటు, రెండవ, మూడవ బహుమతులు రాష్ట్రాల వారీగా ఉంటాయని ఒక అధికారి తెలిపారు. లాటరీ ఆఫర్లు రూ .10 లక్షల నుంచి రూ .1 కోట్ల మధ్య ఉంటాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (సీబీఐసీ) సభ్యుడు జాన్ జోసెఫ్ గత నెలలోనే ప్రకటించడం గమనార్హం. దీని ప్రకారం కస్టమర్ మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు బిల్లును స్కాన్ చేసి జీఎస్టీ నెట్‌వర్క్ (జీఎస్టీఎన్)లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ యాప్ ఈ నెల చివరి నాటికి ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. లక్కీ డ్రాకు అర్హత పొందడానికి ఇన్వాయిస్ విలువపై ఎటువంటి పరిమితి లేదు.
Comments
Please login to add a commentAdd a comment